Wednesday 9 May 2012

భూమి కోసం!

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక మంది వీరులు తమ ప్రాణాలను పణంగాపెట్టి బ్రిటిష్ సైన్యంతో పోరాడారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు.
కథకుడు: అరెరెరె...................... థా త ధికితటథా
           వినరా సోదరా వీర కుమారా
           భారతయోధుల గాథలు
వంత:     తందానా, తందాన దేవనందనానా
కథకుడు: ఉన్నా రెందరో వీరులు
           వారిలో ప్రాతస్మరణీయుడు
           సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి
           సీతారామరాజు అల్లూరి సీతారామరాజు
           నవచైతన్య చేకేతన మార్గ దర్శకుడు
           సీతారామరాజు మన సీతారామరాజు
అంటూ అతడు రగిలించిన విప్లవాగ్నిని, బ్రిటిష్ సైన్యంతో జరిపిన పోరాటాన్ని స్మరింప చేస్తూ స్వాతంత్ర్యదినోత్సవ  వేడుకలలో తన దగ్గర చదివే పిల్లలతో బుర్రకథగా చెప్పిస్తోంది మహిమవేడుకలకు విచ్చేసిన గ్రామ ప్రజలు పిల్లల ప్రతిభను చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు.

బోలో స్వతంత్య్ర భారత్‌కీ జై!                                                                                        
జై హింద్! ...........అంటూ ముగించారు పిల్లలు.

ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారు మ్రోగింది

మహిమ బావ పృధ్వీ ఆమె దగ్గరకు వెళ్ళి కంగ్రాట్స్ మహీ! పిల్లలతో చక్కగా చేయించావు. నిజంగా సినిమా చూస్తున్నట్టు అనిపించింది అంటూ అభినందించాడు.

థాంక్స్ బావా! అంది మహిమ 

మహిమ అక్కడి మండల పరిషత్ స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. ఆమె బావ పృధ్వీరాజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ ప్రస్తుతం అమెరికాలో వుంటున్నాడు. సెలవుపై తన సొంతవూరు వచ్చాడు. ఎప్పటికైనా తన స్వగ్రామానికి శాశ్వతంగా తిరిగి వచ్చి సొంతగా స్కూలును ఏర్పాటు చేసి ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలలోని పిల్లలకు తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా నాణ్యమైన చదువు అందించాలని అతని ఆశయం. విధంగా జన్మభూమి ఋణం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకై  తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తమ పది ఎకరాల భూమి పక్కనే మరో ఐదు ఎకరాలు కొనుగోలు చేయడానికొచ్చాడిప్పుడు. తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పది ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ కొత్తగా కొన్న ఐదెకరాలలో స్కూలు భవనాన్ని, ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడులక్షలు కురిపించే ఉద్యోగాన్ని వదిలేసి పల్లెకు వచ్చి బడి పెట్టాలనుకుంటున్నాడు, వీడికేమైనా పిచ్చా లేక వెర్రా అని పృధ్వీ ఆశయాన్ని హేళన చేసినవారూ వున్నారు. వీటిని లెక్క చేయక తన ఆశయసాధనలో పూర్తిగా నిమగ్నమయ్యాడు పృధ్వీ.

ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాక తనను ఇష్టపడి, తన ఆశయాన్ని గౌరవిస్తూ, ఇంకెవరినీ పెళ్ళిచేసుకోకుండా తన కోసమే వేచి వున్న తన మరదలిని పెళ్ళి చేసుకొని జీవితంలో పూర్తిగా స్థిర పడాలనుకున్నాడు పృధ్వీ.

రిజిస్ట్రేషన్ పనులయ్యాక అమెరికాకు తిరుగు పయనమవుతున్నాడతను.

మహిమ కంట నీరు చూసి, ఇంకెంత! నాలుగు నెలలేగా! వచ్చే జనవరికి తిరిగి వచ్చి జూన్ కంత మన స్కూల్ మొదలెట్టాక ఇక నీ మెడలో మూడుముళ్ళు వేయడమే! అన్నాడు పృధ్వీ.

సరే బావ! ఆల్ ద బెస్ట్! అంటూ సాగనంపింది మహిమ.

చెప్పినట్టుగానే నాలుగు నెలల తరువాత శాశ్వతంగా తిరిగి వచ్చి ప్రభుత్వం నుండి అనుమతులు పొంది తన సొంత స్కూల్ భవన నిర్మాణం చేపట్టాడు పృధ్వీ. మూడునెలల్లో ముప్పావు వంతు పూర్తయింది. ఇక ఒక నెలలో మిగిలినది కూడా పూర్తవుతే జూన్ నుండి మొదలయ్యే విద్యా సంవత్సరంతో స్కూలు ప్రారంభించవచ్చని భవన నిర్మాణం ముందు నిల్చున్న పృధ్వీ పక్కనున్న తన మరదలితో అన్నాడు. అదే జరిగితే వచ్చే శ్రావణమాసంలో తన బావతో పెళ్ళవుతుందని మనసులోనే మురిసిపోయింది మహిమ.

ఇంతలో పృధ్వీ వాళ్ళ నాన్న వెంకటయ్య రొప్పుకుంటూ వచ్చి, నాయనా పృధ్వీ ఇది చూడు, ఇప్పుడే మండల ఆఫీసరిచ్చి వెళ్లారు! అని తన చేతిలోని పేపరును అందించాడు

అది ప్రభుత్వ నోటీసు. చదువుతున్న పృధ్వీ మోములో రంగులు మారుతున్నాయి. పూర్తిగా చదివాక హతాశుడయ్యాడతను

ఏమైంది బావా అలా అయిపోయావు!” అడిగింది మహిమ

ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాలను ప్రత్యేక ఆర్ధిక మండలికి కేటాయించిందట ప్రభుత్వం. దీనికి సంబంధించిన హక్కుదారులు తమ భూములను ప్రభుత్వాధీనం చెయ్యమని నోటీసు పంపించారుచెప్పాడు పృధ్వీ.

విన్న మహిమ విస్తుపోతూ, అందులో మన భూమి కూడా వుందా! అడిగింది సందేహంగా.
 
అవునన్నట్టు తలూపాడు పృధ్వీ

తన ఆశలు, తన బావ ఆశయాలు ఉప్పెనలో కొట్టుకుపోతునట్టు అనిపించింది మహిమకు.  

ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామం చేరారు వారు. అప్పటికే గ్రామంలో కలకలం మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యకు అంతటా వ్యతిరేకత వ్యక్తమైందితరతరాలుగా పంటలు పండించుకుంటూ బతుకుతున్న వారి జీవనాధారాన్ని అప్పగించాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని ఆ గ్రామ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకొక్కరు వచ్చి రచ్చబండ దగ్గర గుమిగూడారు. అందరి మొఖాల్లో ఆందోళన. అక్కడున్న అందరిలో చదువుకున్న వాడు పృధ్వీ ఒక్కడే. అందరి తరుపున పృధ్వీని మండల రెవెన్యూ అధికారితో మాట్లాడమని కోరారు

ఆ మరుసటి రోజు మండల రెవెన్యూ అధికారితో మాట్లాడడానికి వెళ్ళాడు పృధ్వీ. ఎంతసేపూ ప్రభుత్వ ఉత్తర్వులను చదివి చెబుతాడే కానీ, ప్రభుత్వం దేనికొరకు భూమిని సేకరిస్తోందో సరిగా చెప్పలేకపోయాడు 

ఇలా కాదని సమాచార హక్కు చట్టం ద్వారా అసలు విషయాన్ని రాబట్టాడు పృధ్వీ.

రసాయన పరిశ్రమ స్థాపించడానికి ఒక బహుళజాతి సంస్థకు ప్రత్యేక ఆర్ధిక మండలి ద్వారా తమ నుండి సేకరించిన భూమిని అప్పగించడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్న విషయం తెలిసింది.

సేకరించిన సమాచారంతో తిరిగి మండల రెవెన్యూ అధికారి దగ్గరకు రైతులు, రైతు కూలీలతో సహా చేరాడు పృధ్వీ. మా భూములను లాక్కొని విదేశీ సంస్థకు కట్టబెట్టడానికి మీకేమి హక్కుంది అని నిలదీశాడు.

ఆ హక్కును ‘2005 ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ చట్టం’ ఇచ్చింది అని బదులిచ్చాడు అధికారి.

ప్రజల బాగు కోసం చట్టాలను రూపొందించాలి. ఇలా వారి భూముల్ని లాక్కొని నిరాశ్రయులను చేయడానికి చట్టాలు చేస్తారా! అడిగాడు పృధ్వీ

చూడు, నేను ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలుపరిచే వాడినే కాని, చట్టాలను తయారుచేసే వాణ్ణి కాదు. నీకేమైనా అభ్యంతరాలుంటే పోయి వీటిని తయారుచేసిన వాళ్ళను అడుగు అన్నాడు మండల రెవెన్యూ అధికారి.

మేము వెళ్లడం కాదు వాళ్లనే ఇక్కడకు రప్పించి ఈ దగాకోరు ఒప్పందాన్ని రద్దు చేయిస్తాం అంటూ ఆవేశంగా బయటకు వచ్చాడు పృధ్వీ.

మండల రెవెన్యూ కార్యాలయం ముందు అందరూ కూర్చొని శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఆ ధర్నా వారం రోజులు కొనసాగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిస్పందన లేకపోగా గడువులోగా భూములను అప్పగించి నష్టపరిహారం పొందాలని లేకపోతే కఠినచర్యలు తీసుకుంటామని మరొకసారి నోటీసులు పంపించింది. మా భూముల్ని ఇచ్చేది లేదంటూ తమ ధర్నాను కొనసాగించారు రైతులు

గడువుతేదీ రానే వచ్చింది. రైతుల నుండి బలవంతంగానైనా భూమి స్వాధీనం చేసుకోవడానికి మందీమార్బలంతో వచ్చారు అధికారులు. పృధ్వీ ఆద్వర్యంలో దీన్ని ప్రతిఘటించారు రైతులు. పృధ్వీతో సహా కొంతమంది ముఖ్య రైతులను నిర్భందించారు పోలీసులు. దీంతో మరింత రెచ్చిపోయారు రైతులు, రైతుకూలీలూ. సమీపంలోని జాతీయరహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయించారు స్థానిక అధికారులురహదారుల నిర్భందాన్ని ఇలాగే కొనసాగించితే  ప్రభుత్వమే దిగివస్తుందని మరింతగా ఉద్యమించారు రైతులు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సాయుధబలగాలు రైతులపై విరుచుకుపడ్డాయి. అందరి ముందున్న పృధ్వీని చుట్టుముట్టి తమ లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోలేక నేలపై పడ్డాడు పృధ్వీ. దీన్ని చూసిన రైతులు తమ చేతికందిన వాటిని పోలీసులపైకి విసిరారు. చేయిదాటిపోతున్న స్థితిలో కాల్పులు జరపడం మొదలెట్టారు పోలీసులు. కాల్పులు ఆపమని నేలపైపడి పైకి లేవలేని స్థితిలోవున్న పృధ్వీ పోలీసులను ప్రాధేయపడ్డాడు. కానీ వారు కనికరించలేదు. అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. భయాందోళనతో పొలం గట్ల వెంట పరుగులు పెట్టారు గ్రామ ప్రజలు

అరగంట తరువాత క్షతగాత్రులై కొందరు, విగతజీవులై నలుగురు రైతులు పొలాల్లో పడివున్నారు. నీరు పారాల్సిన చోట నెత్తురు పారింది

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పృధ్వీ రెండురోజుల తరువాత కన్ను తెరిచాడు. తన మంచం పక్కన కన్నీళ్ళతో అతని అమ్మానాన్నలు, మరదలు మరియు మిగతా బంధువులు వున్నారు

వద్దు నాయనా! బడి వద్దు, ఏమీ వద్దు!. ఉద్యోగంలో చేరి, పెళ్ళి చేసుకొని హాయిగా వుండు. ఈ ముసలితనంలో ఉన్న ఒక్క కొడుకుకు ఏమైనా అయితే తట్టుకుని మేము బ్రతకలేము అన్నాడు పృధ్వీ నాన్న వెంకటయ్య

పృధ్వీ పెదవి తెరిచే లోపలే మహిమ చాలు బావ! ఈ సమాజ సేవ! నువ్వు చెప్పేది మేము వినడం కాదు, మేము చెప్పేది నువ్వు వినాలిప్పుడు అంది

ఏమి మాట్లాడుతున్నావు! ఇప్పుడు నేను వెనకడుగు వేసి ఉద్యోగంలో చేరగలను. కానీ మిగతావారి పరిస్థితేంటి! కాల్పులలో చనిపోయిన వారి ప్రాణత్యాగానికి అర్థముంటుందా! ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు విరమించేది లేదు నిక్కచ్చిగా చెప్పాడు పృధ్వీ.

ఆసుపత్రిలో వున్నన్ని రోజులు ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ గురుంచి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పది రోజుల్లో పూర్వ స్థితికి వచ్చాడు పృధ్వీ

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఈసారి కలక్టరేట్ ముందు ధర్నా ప్రారంభించారు. పదుల సంఖ్యతో మొదలైన ధర్నా రెండు రోజులకు వందలు, మరో రెండు రోజులకు వేలాది మందితో కొనసాగింది

రైతులతో మాట్లాడి మొత్తం వ్యవహారంపై నివేదిక పంపమని ప్రభుత్వం కలెక్టరును ఆదేశించింది. పృధ్వీని మరికొంతమందిని చర్చలకు ఆహ్వానించారు కలెక్టర్. ఆయనే ఇక్కడకు వచ్చి అందరిముందు మాట్లాడాలని పట్టుబట్టారు రైతులు

కలెక్టర్ ధర్మతేజ వారి దగ్గరకు వచ్చి ఏమిటి మీ డిమాండ్లు? అని అడిగారు

మా దగ్గర ఎలాంటి డిమాండ్లు లేవు సార్! మా జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నాము. విదేశీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోమని వేడుకొంటున్నాముఅన్నాడు పృధ్వీ

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది కదా! వచ్చే పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తుంది.

తరతరాలుగా నేలతల్లిని నమ్ముకొని స్వేచ్ఛగా బ్రతుకుతున్న మమ్మల్ని పరిశ్రమలల్లో కూలీలుగా చేరమంటారా! అయినా ఇతర ప్రాంతాలలో ఇప్పటివరకు రైతుల నుండి తీసుకున్న భూమిలో ఎంతమందికి ఉపాధి కల్పించారు సార్! వాస్తవానికి చాలా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమై రియల్‌ఎస్టేట్‌ కేంద్రాలుగా మారుతున్నాయని వినికిడి. కాదంటారా! ప్రశ్నించాడు పృధ్వీ.

మరి పారిశ్రామికంగా అభివృద్ది ఎలా సాధ్యపడుతుంది ఎదురు ప్రశ్నించారు కలెక్టర్ ధర్మతేజ 

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు రైతుల పచ్చని పొలాలను ధారాదత్తం చేసి మాత్రం కాదు అన్నాడు పృధ్వీ.

ఇక్కడ ఎవరితో పారిశ్రామికాభివృద్ది జరుగుతుందో మీకనవసరం. ఇక్కడి జనాలకు ప్రయోజనంతో పాటు, ఈ ప్రాంత అభివృద్ధి జరుగడమే ముఖ్యం

మీ దృష్టిలో అభివృద్ధి అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (స్పెషల్ ఎకనామిక్ జోన్స్-SEZ)  పేరిట  విద్యుత్ పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు, అణువిద్యుత్ కేంద్రాలను స్థాపించడమేనా సార్! అందులోనూ విదేశీ సంస్థలతో చేతులు కలిపి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సార్వభౌమత్వానికి విఘాతంగా పరిణమిస్తాయి ఇవి. అందుకే ఈ ప్రతిఘటన సార్!

దూరంగా వుండి తన బావ మాటలు వింటున్న మహిమకు ఆక్షణాన పృధ్వీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులా అగుపించాడు ఆమె కళ్ళకి.

అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళ వలన అసలు లాభాలే లేవంటావా! అడిగారు కలెక్టర్.

లాభాల మాటేమో గానీ నష్టాల గురించి మాత్రం చెబుతాను. అనాదిగా ఈదేశంలో ముప్పావువంతు జనాభా నేలతల్లిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ వల్ల కనీసం ఇందులో సగం మంది రైతులు తమ అస్థిత్వాన్ని కోల్పోతారు. ఇళ్లూ, పొలాలు, వూళ్ళు పోగొట్టుకొని బికారుల్లాగా మారుతారు. ఒక ఇంటిలో ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు. మహా అయితే ఒక్కరికి లేదా ఇద్దరికి. అదే పొలం వుంటే ఇంటిల్లిపాదీ కష్టపడతారు. దేశానికి తిండి గింజలను అందిస్తారు.

ఇక పర్యావరణం. పచ్చటి నేల బూడిదతో బుగ్గి కాబడుతుంది. అడువులు నరికివేయబడతాయి. అడివితల్లిని నమ్ముకొని బతికే గిరిజనులు, జంతువులు జీవించే హక్కును కోల్పోతారు. రసాయన పరిశ్రమలవల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ పరిశ్రమలు వెదజల్లే పొగ వల్ల పీల్చేగాలి కాలుష్యం అవుతుంది. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతుంది. దానిపై బతికే మత్స్యకారుల గతేమి కావాలి, చెప్పండి సార్! అన్నాడు పృధ్వీ.

పరిశ్రమల స్థాపన ఆపేద్దామా! ఈ ప్రాంత అభివృద్దిని ఆపేద్దామా! అడిగారు కలెక్టర్

అభివృద్ధి, అభివృద్ధి అంటున్నారు. అసలు మన గ్రామాలు ఇప్పటివరకు ఏమి అభివృద్ధి సాధించాయి సార్! ఆసుపత్రులు వుంటాయి కానీ డాక్టర్లు వుండరు. వున్నా మందులుండవు. బడి వుంటుంది కానీ అది పేరుకే! పైకప్పు ఎప్పుడూ కూలుతుందో తెలీదు. అన్నీ వున్నా టీచర్లు వుండరు. రోడ్లు వుండవు, వున్నా దుమ్ము కొట్టుకొని వుంటాయి. వాటిపై నడవడానికి బస్సులుండవు. సరైన మరుగుదొడ్లు లేక ఆడవారు చెంబు పట్టుకొని వెళుతున్నారు. ఎంత సిగ్గుచేటు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి అరవై సంవత్సరాలు దాటినా ఇంకా ఇలాంటి కనీస మౌలికసౌకర్యాలకే గతి లేదు. ఇక ఎప్పుడో జరిగే అభివృద్ధి గురించి భరోసా ఎలా కలుగుతుంది సార్! చెప్పండి! అంటూ నిలేసాడు పృధ్వీ.

వెంటనే చప్పట్లు, కేకలు, ఈలలు మ్రోగాయి అక్కడ. ఇలా అడిగేవాడు ఊరికోక్కడు వుంటే చాలు దేశం ఎప్పుడో బాగుపడేది అనుకున్నారందరూ.

మరి పారిశ్రామికాభివృద్దిలో దేశం వెనకపడుతుంటే చూస్తూ వూరుకోమంటావా! ప్రశ్నించారు కలెక్టర్

ఎందుకు వెనకపడాలి. పారిశ్రామికాభివృద్ది కూడా జరగాలి. కానీ ఇలా పచ్చటి పోలాల్లో కాదు. భూమి సాగులో లేని చోట, బంజరు భూముల్లో జరిగితే మీరన్నట్టు అక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అది కూడా బహుళజాతి కంపెనీలతో కాదు, మన స్వదేశీ కంపెనీలతో జరగాలి. అందుకు కావలిసిన పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలకు అందించాలి. మనకు మానవ వనరులు అపారంగా వున్నాయి. మన మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తాము పొందిన విజ్ఞానాన్ని ఇక్కడి ప్రాంత ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మనదేశం అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి స్థానం పొందుతుంది.

చివరగా మేము చెప్పదలచుకున్నది ఒకటే సార్! భూమిని తల్లిగా భావించే మనదేశంలో ఆ భూమాత తన పిల్లల సంరక్షణలో వుండాలా లేక ఇక్కడి వనరులను కొల్లగొట్టే వారి చేతుల్లో బందీ అవ్వాలా? అలా బందీ అవ్వాలని మీరు నిర్ణయిస్తే మా ప్రతిఘటన కూడా ఇలాగే వుంటుంది. లేకపోతే రాబోయే తరాలు మమ్మల్ని క్షమించవు. మా వాదన ఇంతవరకు ఓపికతో సావధానంగా విన్నందుకు ధన్యవాదాలు అంటూ నమస్కరిస్తూ ముగించాడు పృధ్వీ.

మరొక్కసారి చప్పట్లు మోగాయి.

కలెక్టర్ ధర్మతేజ, మీ వాదనను ప్రభుత్వానికి తెలియజేస్తా! దయచేసి ఈ ధర్నాను ఆపి మీ వూళ్ళకు వెళ్ళండి అంటూ అందరికి నమస్కరిస్తూ తన కార్యాలయంలోకి వెళ్లారు.

తన ఛాంబరులో కూర్చొని పృధ్వీ గురించి ఆలోచిస్తున్నారు కలెక్టర్ ధర్మతేజ. అంతకుమునుపే  పృధ్వీ గురించి అతనికి తెలుసు. అందుకే అతని దగ్గరకే వెళ్ళి మాట్లాడడానికి వెనుకాడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. ఎంత చక్కగా మాట్లాడాడు. శ్రీశ్రీ గారు అన్నట్టు ఇలాంటి యువకులే ముందు యుగపుదూతలు. వీరే పావన, నవజీవన బృందావన నిర్మాతలు అనుకున్నారు ధర్మతేజ

ఇంటికి వచ్చాడే కాని అతని చెవులలో పృధ్వీ మాటలే ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ వయసులో తను కూడా సమాజానికి ఏదో చేయాలని ఈ ఉద్యోగంలో చేరానన్నది గుర్తుకువచ్చిందతనికి. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి రిపోర్ట్ పంపించాలని ఆలోచిస్తున్నాడు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ఏర్పాటు చేయడంలోని అసలు లక్ష్యం నెరవేరలేదన్నది నిర్విదాంశంప్రభుత్వం నుంచి వేలాది ఎకరాలు పొందిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు రియల్‌ ఎస్టేట్‌ కేంద్రాలుగా మారుతున్నాయి అన్నదాంట్లో కొంతైనా నిజం లేకపోలేదు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో వీటి యజమానులు విఫలం అయ్యారన్న విషయం కూడా అక్కడక్కడా వినపడుతోంది.

 పోస్కో అన్న దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి సంస్థ కోసం సేకరించాలనుకొన్న వ్యవసాయ భూమిని అక్కడి రైతుల ప్రతిఘటనకు రద్దు చేసుకున్న ఒరిస్సా ప్రభుత్వ నిర్ణయం సమయానికి గుర్తుకువచ్చింది అతనికి. ఇప్పుడు తను పంపించే నివేదిక మీదే పృధ్వీ గ్రామ ప్రజల భవిష్యత్తు ఆధారపడివుంది అనుకున్నాడు

ఏఏ అంశాలు తన నివేదికలో పొందుపరచాలని ఆలోచిస్తున్న అతనికి తన పుస్తకాల అరలోని ఒక పుస్తకం అతని కంటిని ఆకర్షించింది. అప్రయత్నంగా అతని కాళ్ళు దాని దగ్గరకు తీసుకెళ్ళాయి. అతని చేతులు ఆ పుస్తకాని బయటకు తీసి పేజీలను తెప్పసాగాయి. ఒక పేజీ దగ్గర అతని దృష్టి ఆగింది. అతని కళ్ళు ఆ పదాలను చదవసాగాయి. ఆ పుస్తకం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం. ఆ ఖండిక జయభేరీ.

ఆ పదాలు........

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!

ఎన్నోసార్లు చదివిన వాక్యాలు ఇప్పడు మళ్ళీ చదువుతుంటే నూతన ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని ఇచ్చాయతనికి.

నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను!

చదివిన తరువాత తన కర్తవ్యం బోధపడింది కలెక్టర్ ధర్మతేజకు. వెంటనే తన లాప్ టాప్ తెరచి దానిపై రెండుగంటలపాటు ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికను టైపు చేశారు. తాను తయారుచేసిన నివేదికను తిరిగి ఓసారి చదివాక సంతృప్తి కలిగింది అతనికి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయారు ధర్మతేజ.

సరిగ్గా నెలరోజుల తరువాత ప్రభుత్వం నుండి వెలువడిన నిర్ణయం పృధ్వీని అతని గ్రామప్రజలను సంబరాలలో ముంచెత్తింది.

 ----------------------సమాప్తం-----------------------------------

31 comments:

  1. అద్భుతం! కళ్ళకు కట్టినట్టు చాలా బాగా వ్రాశారు. ఈ కథలో పృథ్వీ పాత్రను చదువుతుంటే మన పల్లెటూరి పాలేరు బ్లాగరయిన మా రాఫ్సన్ భాయ్ కనిపించారు. తను కూడా విదేశాల నుండి స్వదేశం వెళ్ళి స్కూలు పెట్టే పనిలోనే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నాడు.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు రసజ్ఞ గారు...మీరు చెప్పిన రాఫ్సన్ భాయ్ గారికి అన్ని ఆటంకాలు తొలిగి తన ఆశయాం నెరవేరాలని ఆశిస్తున్నాను.

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  2. కథ బాగుంది....కాని మీరు ధారావాహిక వ్రాస్తారేమో అనుకున్నా... కాని అప్పటికప్పుడు పూర్తయ్యే కథలే బాగుంటాయేమోలెండి. ఈ నెల రోజులలో కనీసం రోజుకి 3నుంచి5సార్లు చొప్పున మీ తదుపరి ప్రచురణ కోసం మీ బ్లాగ్ ను ఓపెన్ చేసేవాణ్ణి... 'నా'నిరీక్షణ ఫలించింది. BEST WISHES $@T'¥@

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు సత్య గారు...నా కథల పట్ల ఉత్సుకత చూపుతున్నందుకు సంతోషంగా వుంది.:))

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  3. Very well written and I really liked the story. Also, I learned about few things which I have no idea before. Good post.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు జలతారువెన్నల గారు...నా కథ వాళ్ళ మీకు తెలీయని విషయాలు తెలిసినందుకు నా ఈ కథకు సార్థకత చేకూరిందని అనుకుంటున్నాను.

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  4. చాల బాగా రాసారు సార్.....

    మంచి విషయం ఒక మంచి కథ గా రూపుదిద్దుకుంది..నచ్చింది :))

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు శేఖర్ గారు...కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు..:))

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  5. మాతృభూమి సౌభాగ్యం కోసం మీరు చేస్తున్న పోరాటం బావుందండీ...

    ReplyDelete
    Replies
    1. పోరాటం చేయడమంత కాదు గానీ...నా చుట్టూ వున్న సమస్యలకు నా ప్రతిస్పందనే ఈ కథలు.
      కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  6. Good Story and good narration.

    ReplyDelete
  7. ఇలాంటి సమస్యలలోని రెండు కోణాలు బాగా చూపారు..కాని పరిష్కారం నిజ జీవితం లో ఇలా ఉండదు...
    మంచి కధ వ్రాసినందుకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. అవును మీరన్నది కరెక్టే!...కానీ నిజంగా పోరాటం చేసేవారికి ఆశాజనకంగా..స్పూర్తిదాయకంగా వుండాలని అలా ముగించాను.
      కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శశి గారు!
      Best wishes,
      Suresh Peddaraju

      Delete
  8. అద్భుతంగా రాసారు సురేష్ గారు..మీ బ్లాగ్ ఇన్ని రోజులు మిస్ అయ్యాను
    ఇక మిస్ అవ్వను :)

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు ఆండి గారు..:)
      జై శ్రీకృష్ణ!

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  9. రాజకీయాల మీద మీ అభిప్రాయాలు చూసాక, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను...కాని ఇది రాజకీయ బ్లాగు కాదాయే., సరే ఏది ఏమైనా నా ప్రశ్నేమిటంటే ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో మీ ఓటు ఎవరికి..? ఒకవేళ మీ బ్లాగులో చెప్పదలచుకోకుంటే vvsmechanical@gmail.com కి ఒక మెయిలు చేయండి.

    ReplyDelete
  10. మీ నుండి నాకు మీ స్పందన అందలేదండి.

    ReplyDelete
  11. సత్య, అసలు ఓటు ఎవరికి వేసేది చెప్పకూడదు. అందుకే రహస్య ఓటింగ్ జరిగేది. ఇప్పుడు రాజకీయనాయకులు అందరూ దొంగలే!...కానీ అందులో మంచి దొంగలు, చిల్లర దొంగలు, ఘరానా దొంగలు, గజదొంగలు వుంటారు. ఎవరు మనల్ని తక్కువ దోచుకుంటాడో..అప్పటి పరిస్టితులని బట్టి ఓటు వేస్తుంటా. నేను ఇప్పడు వచ్చిన ఉపఎన్నికలలో ఓటు వేసే అవసరం కలగలేదు...దానికి కాస్త సంతోషంగా వుంది. ఇక చూడాలి 2014 లో పరిస్థితి....:)

    ReplyDelete
  12. సురేష్ గారు..చాలా చక్కని ఆలోచనాత్మకమైన పోస్ట్ వ్రాశారు. అభినందనలు.
    ఆర్ధిక మండళ్ళ పేరిట బహుళజాతి సంస్థల కి పట్టం కట్టే ప్రభుత్వాల పని తీరుని ప్రశ్నించే హక్కుని .. ప్రుద్వి పాత్రలో చక్కగా ప్రతిబింబింప జేశారు. మీరు వ్ర్రాసిన ప్రతి విషయం నూటికి నూరు శాతం నిజం.
    ప్రుద్వి లాంటి యువకులు ఈ దేశానికి చాలా అవసరం. స్వప్రయోజనాల కోసం రైతుల జీవితాలని నాశనం చేసే స్వార్ధ రాజకీయ నాయకులని తరిమి తరమి కొట్టే చైతన్యవంతమైన యువత కావాలి. ఈ సందేశాన్ని తప్పక చెప్పాల్సిన భాద్యత ఉంది.
    ఎక్స్ ట్రా - ఆర్డినరీ పోస్ట్. మరొకమారు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు వనజా గారు...మీ నుంచి వచ్చిన ప్రశంస ఆనందాన్ని ఇచ్చింది. మీలాంటి వారి నుంచి వచ్చే అభినందనలు చదువుతుంటే నేనూ వ్రాసిన ఈ కథకు సార్థకత చేకూరిందని విశ్వసిస్తున్నాను.
      మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  13. సురేష్ గారూ ! మంచి ప్రయత్నం చేశారు. మీ ఆలోచన - వ్రాసే విధానం బాగున్నాయి. కలెక్టర్లు మీరు రాసినంత తేలికగా మారకపోయినా మీ కథనం బాగుంది. పర్యావరణం - ఆహారభద్రత - గ్రామాలలో కనీస జీవన సౌకర్యాలు లేకుండా పారిశ్రామికాభివృధి (?) అదీ విదేశీ బహుళజాతి పెట్టుబడిదారుల పాదాలకు మొక్కే ఈ ప్రభుత్వాలు స్వదేశీ నినాదంతో స్వాతంత్రోద్యమం నడిపిన బాపూజీ వారసులమని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆలోచింపజేసే + ఈజీగా ఇలాంటి పెద్ద విషయాలను కథనం గా చెప్పిన శైలి , ప్రారంభం - ముగింపు బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కొండలరావు గారు. అవును మీరన్నది నిజమే ఇప్పుడున్న పరిస్థితులలో కలెక్టర్లు మారడం, కథలో వ్రాసినట్టు వేగంగా నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. కానీ అలా తీసుకొనేవాడు, ధర్మానికి ఆలంబనగా వుండే వాడు వుంటే ఎలావుంటుందో చెబుతూ కథను ఆశాజనకంగా ముగించాను. ఒకప్పుడు అంతా మన చుట్టూ మంచి వున్నప్పుడు చెడు ఆలోచన వస్తే దానిని ఒక పీడకలగా మరిచిపోవడానికి ప్రయత్నిచే వాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ పీడలే....మంచిని ఫాంటసీలా ఫీలవ్వాల్సి వస్తోంది. బియ్యంలో రాళ్ళు కాదు...రాళ్ళల్లో బియ్యం కోసం వెతుక్కొనే పరిస్థితి నేటిది. వుందిలే మంచి కాలం ముందు ముందున అనుకుంటూ ఆశాజీవులుగా బ్రతకడమే మనం చేయాల్సింది. అభిప్రాయం తెలిపినందుకు మరొక్కసారి ధన్యవాదాలు!
      ధర్మో రక్షితి రక్షతః

      Delete
  14. వావ్... సూపర్ రాజు గారు..!!
    రెండో సారి చదివా... చాలా బాగా రాసారు...
    క్షమించండి చాలా ఆలస్యం గా కామెంట్ రాస్తున్నందుకు :(

    నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
    నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ హర్ష, మీ నుంచి వచ్చిన ఈ ఆత్మీయ అభినందనకు సంతోషంగా వుంది. అది ఎప్పుడు వచ్చినా పర్లేదు.

      Best Wishes,
      Suresh Peddaraju

      Delete
  15. మీరు ఎంచుకున్న కథాంశంలోనే సగం గెలిచేశారు సురేష్‌గారు! చక్కగా రాశారు కూడా! కొన్నిచోట్ల కళ్లకు కట్టినట్టు రాశారు. అయితే మధ్యలో కథలా కన్నా చర్చలా నడిచినట్టు అనిపించింది. అయితే అందులో కూడా చాలా విలువైన విషయాలు చెప్పారు. ముగింపు కూడా హడావుడిగా ఇచ్చేశారు. ఈ రెంటికీ కారణం ఒకటే.. రాసే ఓపిక లేకపోవడం లేదా లెంగ్త్ ఎక్కువ అయిపోతోందని అనిపించడం.

    నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే కథని మళ్లీ రాయమని. లెంగ్త్ ఎక్కువైనా పర్వాలేదు. మీరు చెప్పిన లాభ, నష్టాలు, పర్యవసానాలు అన్నీ చెబుతూనే, ఎమోషన్స్‌ని కూడా కలిపి రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే నష్టాల గురించి చెప్పడమే కాకుండా వాస్తవికంగా ఒక సామాన్య రైతు కుంటుంబంలో వచ్చే మార్పులను ఒక సంఘటనగా మలచి హృద్యంగా చెప్తే చాలా బాగుంటుంది. మీకు ఇబ్బంది లేకపోతే మళ్లీ రాయగలరు. ఎందుకు అడుగుతున్నానంటే మీరు బాగా రాశారు కాబట్టి. వర్తమాన పరిస్థితుల గురించి భావి తరాలకు తెలియడానికి ఇటువంటి సాహిత్యమే ఆధారం! మీరు దీన్ని ఇంకా చెక్కి చక్కని శిల్పంలా తయారుచేస్తే చరిత్రలో నిలిచిపోయే కథ అవుతుంది. ఇది నిజం! అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు!

    ReplyDelete
    Replies
    1. చదివి అభిప్రాయం తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ చాణక్య గారు! అవును మీరు సరిగ్గా గుర్తించారు. కథ లెంగ్త్ ఎక్కువ అవుతుందని కాస్త కుదించడమైనది. ఎందుకంటే, ఈ కథను నేను ఒక పత్రిక కోసం రాసింది. వారు ఆరు అరఠావులకు మించి వ్రాయకూడదని నియమం పెట్టారు. అలా ఆ నిబంధన వల్లే కథలో నాటకీయత కూడా తగ్గింది. తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది ప్రచురణకు నోచుకోలేదు. దానినే యధాతథంగా ఇక్కడ పబ్లిష్ చేశాను.
      ఇక మీరు చెప్పినట్టు మళ్ళీ రాయడానికి ప్రయత్నిస్తాను. ఒక కీలక అంశం అప్పుడు వ్రాయలేకపోయాను. ఇప్పుడు వ్రాసి కథలో ఇమిడేటట్టు చూస్తాను. అదీగాక ఇంకొంచం పరిశోధన చేసి ఇంకా ఏమైనా కొత్త విషయాలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. మీ ప్రోద్భలంతో కథను తిరిగి వ్రాయాలనే ఆలోచన నాలో రేకెత్తిచ్చినందుకు, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!

      Delete
  16. chala bavundi kadha! kadhanam adbhutanga undi. meeru nako saayam cheyali mee blog ku inni blogs links ela kalapaali naaku artham kaavadam ledu. meru velayithe cheppagalara?

    ReplyDelete
    Replies
    1. కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శైలజామిత్ర గారు!

      Delete
  17. "ఎందుకు వెనకపడాలి. పారిశ్రామికాభివృద్ది కూడా జరగాలి. కానీ ఇలా పచ్చటి పోలాల్లో కాదు. భూమి సాగులో లేని చోట, బంజరు భూముల్లో జరిగితే మీరన్నట్టు అక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అది కూడా బహుళజాతి కంపెనీలతో కాదు, మన స్వదేశీ కంపెనీలతో జరగాలి. అందుకు కావలిసిన పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలకు అందించాలి. మనకు మానవ వనరులు అపారంగా వున్నాయి. మన మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తాము పొందిన విజ్ఞానాన్ని ఇక్కడి ప్రాంత ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మనదేశం అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి స్థానం పొందుతుంది."

    చప్పట్లు చప్పట్లు... standing ovation తీసుకోండి సురేష్‍గారు. రాడికల్ అనుకున్నా నాదొక వ్యూ వుంది. అదేంటంటే ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్లే యువత సదరు చదువు అవగానే ఇక్కడికొచ్చేయాలి. ప్రతిభ కలిగిన అలాంటి విద్యార్దులకు అన్నాళ్లు ప్రభుత్వం ప్రజలనుండి పన్నులు వసూలు వారిపై ఖర్చు చేసినదానికి న్యాయం చెయ్యాలి.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. అవును మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఈ మధ్య డాక్టర్ కోర్సు చదివిన వాళ్ళు ఇక్కడి గ్రామాలలో పనిచేయాలని ప్రభుత్వ నిబంధనకు ప్రజల నుండి చాలా వ్యతిరేకత వ్యక్తమైనది. పూర్తీగా ఇక్కడికి రాకపోయినా కనీసం తమ జన్మభూమి అభివృద్దికి తమ వంతు సహాయం అందిస్తే చాలు. అలా అందించే వారు కూడా వున్నారు. వారి శాతం పెరగాలని ఆశిద్దాం.

      Delete