Saturday 8 March 2014

ఆడపిల్లనమ్మా....

మహిళామణులందరికి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు! 

పోయిన ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలుగువన్.కామ్ నిర్వహించిన కథ పోటీలల్లో ప్రథమ బహుమతి పొందిన నా కథ ఆడపిల్లనమ్మా... 


ఇక్కడ చదవచ్చు...



మనదేశ జనాభాలో స్త్రీల నిష్పత్తి ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. 

ఆడవాళ్ళ సంఖ్య గణనీయంగా రోజురోజుకూ పడిపోతోంది. అసలు 

ఆడపిల్లను గర్భస్త దశలో వుండగానే చిదిమేస్తున్నారు. భ్రూణహత్యలకు 

పాల్పడుతున్నారు. ఆడపిల్లలు వద్దనుకోవటానికి ఈనాడు ప్రధాన కారణం 

వరకట్న సమస్య. వరకట్నం కారణంగానే ఆడపిల్లల కంటే మగపిల్లలు 

నయమని అధిక శాతం తల్లితండ్రులు నమ్ముతున్నారు. ఎన్నో 

వ్యయప్రయాసలు పడి ఆడపిల్లలను పెంచడం, చదివించడం. చివరకు 

భారీగా కట్నకానుకలివ్వడం తల్లితండ్రులకు పెను భారంగా

పరిణమించింది. ఈ సాంఘీక దురాచారాన్ని సమూలంగా రూపుమాపడం 

పోయి అసలు ఆడపిల్లనే వద్దనుకోవడం, పురిట్లోనే చంపేయడం, లేకపోతే 

పుట్టాక వదిలించుకోవాలని చూడడం దారుణం. ఇవన్ని ఆడపిల్లల సంఖ్య 

తగ్గడానికి దోహదపడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే సమాజంలో 

విపరీతపరిణామాలకు దారితీస్తాయని సామాజిక శాస్త్రవేత్తలు 

హెచ్చరిస్తున్నారు.

టీవీలో ప్రత్యేక కార్యక్రమం అలా కొనసాగుతూ వుంది. చూస్తున్న ఎనిమిది 

నెలల గర్భవతి నిర్మల ఆలోచనలో పడిపోయింది. ఇంతలో తలుపు 

ధబాలున తెరుచుకున్న శబ్దం...మనిషి కన్నా అతని నుంచి వస్తున్న 

మందు వాసన ముందు ఆమెని పలకరించింది. హ్మ్...మళ్ళీ తాగొచ్చాడు 

అని అనుకుంటూ చూస్తున్న ఆమెను. “ఏయే అలా గుడ్లప్పగించి 

చూస్తున్నావ్...నీయ...కూడెట్టు”అని గద్దించాడు ఆమె మొగుడు ప్రతాప్.

ఇతగాడు ఓ ప్రయివేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వీరిద్దరికి 

పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అయ్యింది. మూడేళ్ళ పాపా కూడా ఉంది. 

ఈ నాలుగేళ్లలో పాతిక కంపెనీలన్నా మారివుంటాడు. ఎక్కడా కుదురుగా 

వుండడు. సరే నేను కూడా పనిచేస్తే కాస్త ఊరటగా వుంటుందనుకున్న 

ఆమెను గడప దాటనీవడు. ఏంటో ఈ మనిషి అనుకుంటూ టీవీ కట్టేసి 

అన్నం వడ్డించడానికి అక్కడి నుండి కదిలింది.

ముద్ద చేతిలోకి తీసుకోవడం...మూతి దగ్గరకు రాగానే తూలడం 

జరుగుతోంది.

చూసి చూసిన నిర్మల తనే నోటికి అందివ్వడానికి ప్రయత్నించింది.

ఆమె చేతిని విసురుగా కొట్టి ‘తీయే...నీయ...అని తిడుతూ తోసేశాడు.

“ఆసుపత్రికి వెళ్ళావా?” అడిగాడు ప్రతాప్ 

“ఆ” ముక్తసరిగా సమాధానం ఇచ్చింది నిర్మల.

“స్కానింగు చేసిందా డాక్టరు..పిల్లనా? పిల్లోడా? ఏమైనా చెప్పిందా?”

“ఆ చేసింది...కానీ ఎవరనేది చెప్పనంది. మళ్ళీ ఇంకోసారి అడిగితే 

బావుండదని గట్టిగా చెప్పింది”

కంచంలో చేయికడుగుతూ నాలిక మడత పెట్టి “ఈతూరి గనక మగపిల్లోడు 

కాక మళ్ళీ ఆడపిల్ల పుట్టిందో...నీయ...చంపేత్తాను నిన్నూ, ఆ 

పుట్టిందాన్నిఏమనుకున్నావో”. అంటూ అక్కడి నుండి కదిలాడు.

ఆ మాటలకు కడుపులో వున్న పసికందు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు 

అనిపించింది నిర్మలకు. లోపలి కదలికలకు.

అదేమన్నా నా చేతిలో వుందా నీ మూర్ఖత్వం కాకపోతే అని మనసులోనే

గొణుక్కుంటూ తను తినటం ముగించింది. ఆమె లోపల గదిలోకి వెళ్లేసరికి

ప్రతాప్ మంచం పై బోర్లా పడిపోయుండడం చూసింది. నిట్టూరుస్తూ వచ్చి

నిద్రపోతున్న తన మూడేళ్ళ కూతురు పల్లవి పక్కన పడుకుంది. తన

కడుపుపై చేతితో నిమురుకంటూ నువ్వూ నిజంగా ఆడపిల్లవైతే నిన్ను ఆ 

దేవుడే కాపాడుకోవాలి అని మనసులో అనుకుంటూ ఎదురుగా 

వున్నా దేవుడి ఫోటోలకు దండమెట్టుకుంది.

రాత్రి తొమ్మిది గంటలు : ప్రభుత్వాసుపత్రి లేబర్ రూంలో పురిటినొప్పులతో 

గట్టిగా అరుస్తోంది నిర్మల. బయట ఆమె భర్త వున్నాడు. కాన్పు 

కష్టమయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడానికి కూడా డాక్టర్లు 

సిద్ధంగా  వున్నారు. అలా మరో గంట వేదన అనుభవించాక ప్రసవం 

జరిగింది.

పుట్టిన ఆ పసికందును చేతిల్లోకి తీసుకొని “ఆయ్ ఆడపిల్ల!” అంది నర్సు.

మగతలో వున్నా నిర్మల విని ఉలిక్కిపడింది. విషయం తెలిస్తే తన భర్త 

నుండి వచ్చేప్రతిస్పందన ఎలా వుంటుందో  వూహించుకోవదానికే 

భయపడుతోందామే. నర్సు పాపాను ఎత్తుకొని చూపిస్తూ తనని 

చూడమంది. చూడు చూడు నీ బిడ్డ ఎంత ముద్దుగా వుందో...బొమ్మలా 

వుంది అని చూపించబోయింది.

ఉబికివస్తున్న కన్నీళ్ళను చూపించలేక తల పక్కకు తిప్పుకుంది నిర్మల.

బొడ్డు తాడును కత్తిరించి బిడ్డను తీసుకెళ్ళి శుభ్రపరిచి తిరిగి నిర్మల వున్న 

మంచం దగ్గరకు తెచ్చింది నర్సు.

“ఆయ్ బుజ్జీ ఇదిగో మీ అమ్మ...అమ్మ పక్కన బజ్జోమ్మ” అంటూ నిర్మల 

పక్కన పడుకోబెట్టింది.

అబ్బా ఏమిటీ వెలుతురు...అంతా కొత్తకొత్తగా వుంది. ఇన్నాళ్ళు అమ్మ 

కడుపులో హాయినా వున్నాను. ఇప్పుడే కదా బయటపడ్డాను. 

ఇక ఒక్కొక్కరినీ పలకరించాలి. ఈ లోకానికి నన్ను నేను పరిచయం 

చేసుకోవాలి.

అమ్మా...అమ్మా చూడు...నేను నీ పక్కనే పడుకున్నాను. చేత్తో

తడుతున్నాను...ఓసారి చూడు! అమ్మయ్య చూశావా...నువ్వేనా నన్ను 

కన్న అమ్మవి. 

అయ్యో ఎందుకేడుస్తున్నావ్? నాన్నా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని గొడవ 

చేస్తాడనా? లేదులే...నన్ను చూశాక బంగారు బొమ్మ పుట్టిందని అన్నీ 

మరచిపోతారాయన. అయినా ఆడపిల్లగా పుట్టడం నా తప్పామ్మా...అది 

నా చేతుల్లో లేదు కదా...నువ్వా కావాలని చేసిందీ కాదు. మరి నాన్నకు 

ఎందుకంత కోపం మనిద్దరి మీద.

ఏంటి అలా చూస్తున్నావ్? ఈ విషయం నాకెలా తెలుసనా...నేను నీ 

కడుపులో వున్నప్పటి నుంచే అన్నీ వింటున్నానుగా.

అవును అక్క ఏదీ? అమ్మమ్మ ఇంటికి పంపించావు కదా? వస్తుందా నన్ను

చూడడానికి? అసలు నేను బావుంటానా? అక్కనా?

మిలమిలా మెరిసే కళ్ళతో తననే చూస్తున్న పాపాయిని చూస్తుంటే తనతో 

ఏదో మాట్లాడుతున్నట్టు, అడుగుతున్నట్టు, అనిపించింది నిర్మలకు.

ఆప్యాయంగా చేతితో తడుముతూ “చిట్టితల్లీ నిన్ను తనివి తీరా 

చూద్దామంటే, కన్నీటి పొర అడ్డుపడి సరిగ్గా కనిపించటం లేదని” 

మనసులోనే కుమిలింది.

ఇంతలో నర్సు వచ్చింది. వస్తూ “ఏంటి మీ ఆయన...పాప పుట్టింది 

చూద్దువుగానీ రా అని పిలిస్తే వినపడనట్టు వెళ్ళిపోయాడు.”

అది విన్న వెంటనే మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది నిర్మలకి. సమాధానం 

ఇవ్వలేక అలాగే నీరు నిండిన కళ్ళతో నర్సును చూస్తుండిపోయింది.

“అంటే ఏంటి...ఆడపిల్ల పుట్టిందనా..ఏం...ఆడపిల్ల ఎందులో తక్కువ? 

బాగుంది చోద్యం” అంటూ పాపకు పాలు పట్టుమని చెప్పి వెళ్ళిపోయింది 

నర్సు.

అదీ అలా అడుగమ్మా నాన్న వచ్చినప్పుడు. అసలు నాన్నా వస్తాడా? 

నన్ను చూస్తాడా...ఇక్కడే వదిలేసి 

రమ్మంటాడ..నన్ను వదిలివెళ్ళకమ్మా..నీతోపాటు ఇంటికి 

తీసుకెళ్ళు. నేను అక్కను చూడాలి. అక్కతో ఆడుకోవాలి. అరే నాకేమి 

అవుతోంది. ఓ... నాకిప్పుడు ఆకలేస్తోంది అనుకుంటా...మరి నేనిప్పుడు 

ఏమి చేయాలి..అయ్యో నాకెడుపొస్తోంది....

బిడ్డ ఏడుపు విని చ్చు...చ్చు. లేదు...లేదమ్మ భూమి మీద పడగానే 

నీకు ఎన్ని కష్టాలో కదా...ఏంటో అని అనుకుంటూ సరే పాలుతాగు అని 

తన స్తన్యాన్ని బిడ్డ నోటికి అందించింది నిర్మల. పాలుతాగుతున్న తన బిడ్డ 

తలపై ముద్దుపెట్టుకుందామె.

మరో అరగంటలో ప్రస్తూతి వార్డులోకి మార్చారు ఆమెని. ఆ వార్డులో ఇంకో 

ఇద్దరితో పాటు తను మూడవ బాలింత. పాపకు పాలు పట్టుతూ అలాగే

నిద్రలోకి జారుకుంది నిర్మల. పొట్టనిండా పాలుతాగిన ఆమె బిడ్డ కూడా 

పక్కన తనని అట్టిపెట్టుకొని నిద్రపోతోంది.

పూర్తిగా తెల్లారడానికి ఇంకో గంట సమయం వుంది. ఎవరో చేత్తో 

తడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచింది నిర్మల. 

ఎదురుగా ఆమె భర్త ప్రతాప్.

“వుష్...నేను చెప్పేది విను. ఆ పుట్టినదానిని ఇక్కడే వదిలేసి వచ్చేయ్ 

ఇట్నుంచి ఇటే పోదాం. బయట ఆటో రెడీగా వుంది.” అన్నాడు 

తనకు మాత్రమే వినపడేట్టు.

భయంగా చూస్తూ “బిడ్డ...బిడ్డను వదిలేసి నేను రాను” అంది నిర్మల

పళ్ళు పటపటమని కొరుకుతూ “చంపెత్తా నిన్నూ, దాన్ని 

ఏమనుకున్నావో. ఆడపిల్ల పుడితే ఏమవుతుందో ముందే చెప్పా కదా. 

ఇందుకే కదా నువ్వు ఆసుపత్రిలో చేరిన ఇషయం ఎవరికీ చెప్పలేదు. 

మీయమ్మ, మాయమ్మ వాళ్ళు అడిగితే పుట్టింది పురిట్లోనే చచ్చింది అని 

చెప్పొచ్చు. పదపద మళ్ళీ నర్సు వస్తుంది.” అంటూ తొందరపెట్టాడు.

ఏమీ మాట్లాడక అలాగే భయంగా చూస్తుండిపోయింది నిర్మల.

“ఏందే అట్లా చూత్తావుండావు. ఇది ఏమవుతుందనా? దీన్ని ఎక్కడోచోట

వదిలేయమని ఆయమ్మకు చెప్పాలే....అయిదొందలు కూడా ఇచ్చా. లెగు

లెగు తెల్లారుతుంది” అంటూ తన పెళ్ళాన్ని గుంజాడు ప్రతాప్.

ఆ గుంజుడికి మంచం మీద నుండి కింద పడబోయింది. తన రెండు 

చేతులను ఆమె భుజాలకింద వేసి పట్టుకొని బిరాబిరా లాక్కెళ్ళాలని 

చూశాడు.

చీర సర్దుకుంటూ వెనక్కి తిరిగి మంచంపైన వున్న బిడ్డను చూసి “వదులు 

నీవు చెప్పినట్టే చేస్తా. ఒక్కసారి బిడ్డను చూసి వస్తా” అంటూ 

విదిలించుకుంది నిర్మల. చేసేదేమీ లేక  ఆమెను వదిలేశాడు. మంచం 

దగ్గరకు పోయి నిద్రపోతున్న తన బిడ్డ పక్కన కూర్చొని తల నిమిరుతూ,

“ఆడపిల్ల వద్దనుకుంటున్న ఇంట, నా అమ్మతనాన్నే

వదిలేసుకుంటున్నా...అమ్మనే కానీ దానికంటే ఒకరికి ఆలిని, ఆర్ధిక 

స్తోమత లేనిదాన్ని. తల్లీ! నిన్ను నిర్జీవిగా చూడటంకన్నా, పరజీవిగా 

చూడటమే మేలనుకొని నిన్నొదిలి వెళ్తున్నా,....క్షమించరా కన్నా...నాకు 

వేరే దారీలేదు ఇంత కన్నా. మీ అక్క కోసమైనా నేను బ్రతకాలిగా. నిన్ను 

ఏ ధర్మాత్ముడో ఆదరించాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను” 

అంటూ కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖాన్ని నోటిలోకి చీరకొంగును 

కుక్కుకొని అతి  కష్టంగా ఆపుకుంటూ కూతురి నుదిటిపై ముద్దుపెట్టుకొని 

పైకిలేచి ఇక తిరిగి  చూడకుండా వెళ్ళిపోయింది. తొమ్మిదినెలలు మోసి 

కన్నందుకు తొమ్మిది గంటలు కూడా అమ్మగా లేకుండాపోయానని 

కడుపుకోతను భరిస్తూవెళ్ళిపోయింది నిర్మల.

ఆఫీసుకు పోవడానికి : హడావుడిగా తయారవుతున్నాడు కైలాష్ నాథ్. 

అప్పటికే రెండుసార్లు ఫోన్ చేశాడు అతని పై ఆఫీసరు ఇంకా రాలేదేమని.

ఇన్స్పెక్షన్ వుంది తొందరగా రమ్మని కేకలేశాడతను. ఇదిగో పావుగంటలో 

మీ ముందు వుంటాను అని హామీ ఇచ్చాడు. కైలాష్ ది టవును ప్లానింగ్

ఆఫీసులో గుమాస్తా వుద్యోగం.

“ఏందీ నీ హడావుడి? ఎక్కడికి పోతున్నావ్ ఇంతపొద్దున్నే. అదేదో క్షణం

తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుంది నీ యవ్వారం. పైసా పై

ఆదాయం లేదుకదా జీవితానికి...పెద్ద నిజాయితీ పరుడు బయలుదేరాడు 

నా ప్రాణానికి...హ్మ్” అంటూ విసుక్కుంది అతని భార్య గంగా భవాని.

ఇది రోజూ వుండేదే కదా అనుకుంటూ తన మానాన తాను 

తయారవుతున్నాడు కైలాష్.

“ఏందయ్యా ఏమీ వినపడనట్టు నటిస్తున్నావు. నువ్వు యాటికైనా పో గానీ

వచ్చేటప్పుడు రెండు మంచి జరీ చీరలు పట్టుకురా. రేపటి నుండి

నవరాత్రులు. ఇరుగుపొరుగోళ్ళు పేరంటానికి పిలుస్తారు. పాత చీరతో 

వెళ్ళలేను” అంది.

ఏమీ మాట్లాడకుండా తయారవుతున్న అతడిని “ఏంది 

...వినపడుతోందా?” అని గద్దించింది.

“ఆ ...ఆ సరేలేవే” అంటూ అప్పుడే నిద్రలేచి మంచంపై కూర్చొన్న తన 

ఇద్దరి కొడుకులను చూసి, దగ్గరకు వచ్చి “ తొందరగా రెడీ అయి స్కూలికి

వెళ్ళండి నాన్నా. ఈ రోజు మిమ్మల్ని అమ్మ వదిలిపెడుతుంది. బై 

నాన్నలు” అంటూ ఇంటి గడపదాటాడు.

వారి ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడు అభిషేక్ నాల్గవ తరగతి, రెండోవాడు కార్తిక్ 

రెండవ తరగతి చదువుతున్నారు. తొలిసారి మగబిడ్డ పుట్టినా మల్లిసారి

అయినా అమ్మాయి పుట్టాలని ఎంతో కోరుకున్నాడు కైలాష్. కానీ తానొకటి 

తలిస్తే దైవమొకటి తలచాడని అతనికి రెండవసారి కూడా 

అబ్బాయే పుట్టాడు.

తన మోపెడ్ పై వెళుతున్నాడు కైలాష్. తను వుండే సందులోంచి కుడివైపు

తిరిగాడు. ఆ సందులోకి ప్రవేశించగానే రోడ్డు పక్కన కొంతమంది

మనుషులు గుమిగూడి వుండడం గమనించాడు. తన మోపెడ్ వేగం 

పూర్తిగా తగ్గించి ఏమైందని అక్కడ నిల్చొని చూస్తున్న మనిషిని అడిగాడు.

“పసిబిడ్డను ఎవరో ఫుట్పాతుపై వదిలి వెళ్ళారంట ఇప్పుడే!” సమాధానం

ఇచ్చాడతను.

అవునా...అయ్యో అంటూ తన మోపెడ్ను పక్కకు తీసుకొని స్టాండ్ 

వేసొచ్చి జనం మధ్యనుంచి ముందుకు వచ్చాడు కైలాష్.

రోజూ చెత్త వూడ్చే మునిసిపాలిటీ ఆమె ఏదో వివరిస్తోంది అక్కడున్న వారికి. 

ఎవరు వదిలేసి వెళ్లారని అడిగాడు కైలాష్ ఆమెని.

“ఏమో సారూ ! నేను ఆ చివరన చెత్త తీస్తున్నాను కదా...ఇంతలో ఏడుపు

వినిపించింది. ఎవరాని చూసి వచ్చేంతలోపు ఇక్కడ పడుకోబెట్టి

పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఒకామె. సందు చివరికి వచ్చి చూసేసరికి 

ఎవరూ కనిపించలేదు. వచ్చి చూస్తిని గదా ఆడపిల్ల. అందుకే

వదిలించుకోవాలనుకున్నారేమో. పాపం....” అంటూ సానుభూతి 

వ్యక్తపరిచింది.

అవునా అన్నట్టు తలూపుతూ ఫుట్పాతుపై పడుకోబెట్టిన పసికందును 

చూశాడు కైలాష్.

“ఎంత ముద్దుగా వుంది. ఎలా వదిలించుకోవాలనిపించింది వారికి. మరీ 

ఇంత కఠినాత్ములుగా తయారయ్యారేంటి మనుషులు. మానవత్వం అన్నది

అడుగంటిపోతోంది మనుషుల్లో రోజురోజుకీ” అతని మనసులోని మాటలు

అప్రయత్నంగానే నోటినుండి వెలువడ్డాయి.

అతని మాటలు విని అక్కడున్న వారు పాప కన్నతల్లి గురించి తలోమాట

అనసాగారు. వాటిని వినలేక మళ్ళీ తన ఆఫీసరు ఫోన్ గుర్తొచ్చి మోపెడ్

స్టార్టు చేసుకొని బయలుదేరాడు. నడుపుతున్నాడు కానీ మనసంతా 

ఏదోలా వుంది అతనికి.

ఇప్పుడా బుజ్జితల్లి  పరిస్థితి ఏంటి? కాసేపటికి నాలాగే అందరూ తలోదారి 

వెళతారు. ఎవరూ పట్టించుకోరు కదా...జాలి చూపారు కదా అనుకున్నాడు.

మళ్ళీ వెంటనే నేను చేసిందేమిటి? పాపం ఎప్పుడూ పాలుతాగిందో ఏమో 

కనీసం పాలు తెచ్చి పట్టలేకపోయానే అని వగచాడు. మళ్ళీ అతని

కళ్ళముందు ఆ పసికందు కదిలాడింది. అతని కంట నీరు వూరింది. ఎవరో 

ఒకరు ఆదరించాలి అనుకుంటున్నానే గానీ ఆ ఒక్కరు నేనే ఎందుకు

కాకూడదు. అనుకున్న తడువే ఏమైతే అదయింది ఎలాగైనా ఆ 

చంటిపాపను కాపాడాలని మనసులో గట్టిగా అనుకుంటూ మోపెడ్ 

వెనకితిప్పాడు.

దారిలో పై ఆఫీసర్ నుండి ఫోన్ వస్తే నేను ఈ రోజు రాలేను...కడపు అప్సెట్

అయ్యిందని చెప్పి పెట్టేశాడు.

తను ఇంతకుముందు ఆగిన చోటికి వచ్చాడు. అప్పటికే చాలా మంది

వెళ్ళిపోయారు. మిగిలిన ముగ్గురు ఏమి చేయాలిప్పుడు అని తర్జనభర్జన

పడుతున్నారు. మరోపక్క పాప గుక్కతిప్పుకోకుండా ఏడవసాగింది.

మోపెడ్ స్టాండ్ వేసి దగ్గరకెళ్ళి “అయ్యొయ్యో పసికందును ఇలా ఎలా 

వదిలేశారో కదా..పాపం. ఆకలేస్తున్నట్టుంది” అంటూ తన రెండు చేతులతో

ఎత్తుకున్నాడు. అంతే టక్కున ఆగిపోయింది ఏడుపు. అక్కడున్న వారు

ఆశ్చర్యపోయారు.

తన చిన్న చిన్న కన్నులు తెరుస్తూ అతన్నే చూడసాగింది. “ఏమ్మా అలా

చూస్తున్నావు? ఆకలేస్తోందా చిట్టిబొజ్జకు. ఇంటికి పోదామా అక్కడ

అన్నయ్యలు వుంటారు. వాళ్ళతో ఆడుకుంటూ పాలుతాగుతావా మరి” 

అన్నాడు.

“మీలో ఎవరైనా నా బండిని మా ఇంటివరకు తీసుకువస్తారా? ఇక్కడే మా 

ఇల్లు.” అని అడిగాడు అక్కడున్న వారినుద్దేశించి.

“హలో ...ఏంటి ఈ పాపను మీరు తీసుకువెళతారా...ఎందుకు 

అనవసరంగా రిస్కు. వదిలేయండి. పోలీసులకు చెప్తే వారే వచ్చి 

చూసుకుంటారు”అన్నాడు అందులో ఒకతను.

“మనం పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి విచారణ జరిపెసరికి చాలా టైం

పడుతుంది. ముందు పాపకు పాలు పట్టి తన బొజ్జ నింపితే ఆ తరువాత

ఆలోచించవచ్చు ఏమి చేయాలన్నది” చెప్పాడు కైలాష్.

కాసేపయ్యాక సరే నేను వస్తాను పదండంటూ ఇందాక మాట్లాడిన వారు 

కాకా ఇంకొక వ్యక్తి ముందుకువచ్చాడు. అతను  బండి నడిపిస్తూ వుంటే

పాపను ఎత్తుకొని వెనక కూర్చున్నాడు కైలాష్.

ఆ వచ్చేదారిలో ఎన్ని అవాంతరాలనైనా ఎదురవనీ వాటిని ఎదుర్కొని ఈ 

పాపను చట్టపరంగా దత్తతతీసుకొని పెంచుకోవాలని. ఆడపిల్ల లేని లోటును

తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కైలాష్ నాథ్. అతని 

మనసులోని విషయాన్ని గ్రహించినదై తన రెండు చేతులనూ దగ్గరికీ 

తీసుకుంటూ అతనికి నమస్కారం చేసింది ఆ ఆడపిల్ల.

ఆడపిల్ల పుట్టిందని గర్విద్దాం!.....ఆడపిల్ల ఆస్తిత్వాన్ని కాపాడుదాం!    

http://www.teluguone.com/splevents/womensdayspecial2013/single/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A5%E0%B0%AE-%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF-14889.html#sthash.xjHH83ia.xtvNi9xO.dpbs

2 comments:

  1. సుదీర్గమైన ఈ కథ సుఖాంతాన్నివటం ఆనందం, మీ శైలి అద్బుతం.

    ReplyDelete
    Replies
    1. ెధన్యవాదాలు ఫాతిమా గారు. మీ కవిత ఇచ్చిన ప్రేరణే ఈ కథ.

      Delete