Saturday 3 September 2011

అందరూ బాగుండాలి!

అందరూ బాగుండాలి
- సురేష్‌కుమార్ పెద్దరాజు
July 25th, 2010 ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది.గుడిసె గడప దగ్గర కూర్చొని ఆకాశంవంక దిగాలుగా చూస్తున్నాడు ఈరయ్యగా పిలవబడే ఈశ్వరయ్య. యాటకు వెళ్ళక మూడురోజులైంది. ఇంకా జోరుగా పడుతూనే వుందీ వాన. ఎప్పటికి తెరిపిస్తుందో అనుకొంటూ నిట్టూర్చాడు.
ఈశ్వరయ్య రోజు వేటకు వెళ్ళి ఏట్లో పట్టిన చేపలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కూతురికి పోయిన ఏడాదే పెళ్ళిచేసాడు. అల్లుడు కూడా ప్రక్కూళ్లో చేపల వ్యాపారం చేస్తుంటాడు. కొడుకు వూరి బళ్ళో ఐదవ తరగతి చదువుతున్నాడు.

“ఒసేయ్, గంగి! ఆకలేత్తోంది ఏదన్నా వుంటే పెట్టు” అరిచాడు ఈశ్వరయ్య. పళ్ళెంలో చద్దన్నం పెట్టుకొని కాసిని మజ్జిగ పోసుకొని తెచ్చి అతని ముందుంచింది ఈశ్వరయ్య పెళ్ళాం గంగాభవాని.
“చిన్నయ్య ఏమన్నా తిన్నాడా”? అని కొడుకు గురించి అడిగాడు.

“ఆ తిన్నాడు అంది”. మళ్ళీ తనే ‘బియ్యం ఇంకొక పూటకు వత్తాయి ఈ వానేమో తగ్గదాయే. ఎట్లయ్య’ అడిగింది గంగాభవాని. “అదే ఆలోచిత్తా వుండానే. ఏమి తోయట్లేదు” అన్నాడు ఈశ్వరయ్య.

ఇంతలో, “ఏయ్ ఈరయ్య వాగు మంచి పొంగుమీదుంది, రాదారి మీదుగా పారుతోందట. వూళ్ళోకి వచ్చే బళ్ళు, పోయే బళ్ళు యింటికాడ నిల్చిపోయాయంట తెలుసా!” అంటూ అరిచాడు. ఎదుటి గుడిసెలో వుండే వెంకటయ్య.
“అయ్యో! అవునా మామా”

“ఔ! మరి ఇప్పుడే మావాడు వూళ్ళోకి వెళ్ళొచ్చాడు”, చెప్పాడు వెంకటయ్య.
ఊరిని ఇతర ప్రాంతాలతో కలిపేది ఆ రహదారే. ఊరికి ఒకవైపు రహదారి. మరోవైపు ఏరు. రహదారికడ్డంగా వాగు. ఎంతో వాన వస్తే గాని ఆ వాగు అంతగా పొంగి పారదు. ఎగువ ప్రాంతంలో కురిసిన వాన నీళ్ళు కూడా ఆ వాగు ద్వారా ఏట్లో కలుస్తాయి.

ఆలోచిస్తూ తింటున్న ఈశ్వరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వాన నీళ్ళు గడప మీదుగా గుడిసెలోకి ప్రవేశించాయి.

శివాలయం ఏటి గట్టుమీద కట్టిన పురాతన ఆలయం. విశ్వనాథశాస్ర్తీ ఆలయ అర్చకుడు. శివాలయంలో నిల్చున్న విశ్వనాథశాస్ర్తీ ఏటి వైపు తదేకంగా చూస్తున్నాడు. చూస్తుండగానే ఏట్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే ఆలయంనుండి ఏట్లోకి దారితీసే మెట్లన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఏ క్షణమైనా ప్రహరి గోడ దాటి నీళ్ళు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడు చూడలేదు. చాలా ఆందోళనలో వున్నాడతను. ఆలయంలో పనిచేసే సహాయకులు కూడా వెళ్ళిపోయారు.

ఇంతలో ఆ వూరి బడి ప్రధానోపాధ్యాయుడు గుళ్ళోని విశ్వనాథశాస్ర్తీని చూసి ‘‘శాస్త్రులూ ఇంకా ఆలోచిస్తూ నిల్చున్నారేంటి, తొందరగా గుడి తలుపులు మూసి కుటుంబంతో సహా ఊరువదలండి. ఇప్పటికే సగం వూరు ఖాళీ అయ్యింది. ఆలస్యం చేస్తే ప్రమాదంలో పడతారు’’ అని హెచ్చరిస్తూ వేగంగా వెళ్ళిపోయాడు.

విశ్వనాథశాస్ర్తీ గర్భగుడిలోకి వెళ్ళి ‘‘పరమేశ్వరా ఏమిటీ స్థితి. కర్తవ్యం బోధపడడంలేదు. నిస్సహాయుడిని. నీవే దిక్కు తండ్రీ’’ అని వేడుకున్నాడు. శివార్చన చేసి హారతి ఇచ్చాడు. శివ నామస్మరణ చేసుకుంటూ గర్భగుడినుండి బయటకు వచ్చేసరికి నీరు ప్రహరిగోడ మీదుగా ఆలయంలోకి ప్రవేశించడం చూసి భయాందోళనకు గురయ్యాడు.
విశాలాక్షి భర్త ఆదేశానుసారం బట్టలు, అత్యవసరమైన వస్తువులు చేతి సంచుల్లో సర్దుతోంది. ‘‘ఏమేవ్! ఇంకా ఎంతసేపు సర్దుతావ్ కానీయ్. ఊళ్ళో మనమే మిగిలినట్టున్నాము. రహదారి కూడ మునిగిపోయిందంట. ఊరెలా దాటుతామో! అంతా ఆ శంకరుడిదే భారం’’ అన్నాడు విశ్వనాథశాస్ర్తీ.

ఈశ్వరయ్య తెప్ప నెత్తిమీద పెట్టుకొని బిరబిరా వాగువైపు నడుస్తున్నాడు. వెనక అతని పెళ్ళాం, కొడుకు అనుసరిస్తున్నారు. తెప్ప సాయంతో బేగిన వూరు దాటాలి అని మనస్సులో అనుకొన్నాడు.
విశ్వనాథశాస్ర్తీ తన కుటుంబంతో వాగు దగ్గరకి చేరుకొన్నాడు. వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లుచేసిందేమోనని చుట్టూ పరికించాడు. అలాంటి జాడేమి కనిపించలేదు. చాలామంది ఊరి జనం అప్పటికే వాగు దాటి ఆవలి గట్టుపై వున్నారు. పైనుండి జోరుగా వర్షం పడుతూనే వుంది. వాగు దాటి ఏదో ఒక బండి ఎక్కి అక్కడికి ముప్ఫై మైళ్ళదూరంలో వున్న పట్టణాన్ని చేరాలి. కానీ ఎలా దాటడం అనుకుంటుండగా అవతలి గట్టు దగ్గర ఒక తెప్ప ఎవరినో దించి మళ్ళీ ఈ గట్టు దగ్గరకు వస్తూ వుండడం గమనించాడు. తెప్పమీద వున్న మనిషి అంత స్పష్టంగా కనపడడం లేదు. కొద్దిగా దగ్గరకు వచ్చేసరికి గుర్తుపట్టాడు విశ్వనాథశాస్ర్తీ.

ఈశ్వరయ్య వడివడిగా తెప్పను గట్టువైపు తీసుకురాసాగాడు.

ఇప్పుడు వీడి సాయం అర్థించాలా వద్దా అని సందిగ్దావస్తలో పడ్డాడు. ఈశ్వరయ్య గట్టువైపువస్తూ పెళ్ళాం, కొడుకును తెప్ప ఎక్కడానికి సమాయత్తం అవ్వమని చెప్పాడు. కాని ఇంతలో కొద్ది దూరంలో కుటుంబంతో సహా నిల్చున్న విశ్వనాథశాస్ర్తీని గమనించాడు.

మరో ఆలోచన చేయకుండా ‘‘సామి రండి వాగు దాటిస్తాను’’అని పిలిచాడు. విశ్వనాథశాస్ర్తీ తటపటాయిస్తూ భార్య పిల్లలవైపు చూశాడు. వాళ్ళు దీనంగా తెప్పలో వెళదాం అని అర్ధిస్తున్నట్టు అనిపించిందతనికి. ‘‘సామి బేగిరండి. ఆలోచిస్తూ వుంటె పనికాదు. ఇప్పుడే డాట్టరు బాబు వాళ్ళను దాటించి వత్తున్నాను. ఎక్కండి సామి మిమ్మల్ని కూడా దాటించొస్తాను’’. తప్పనిసరిగా తెప్పలోకి అడుగుపెట్టాడు విశ్వనాథశాస్ర్తీ. అందరూ ఎక్కిన తరువాత చూస్తే ఇక అక్కడ కాస్త కూడా చోటు మిగల్లేదు.

‘‘గంగి సాములోరిని వాగుదాటించొత్త, ఈడనే వుండండి’’ అన్నాడు ఈశ్వరయ్య.
‘‘అట్నేకాని’ అంది గంగాభవాని ‘‘బేగిరా అయ్యా! కొడుకన్నాడు’’. వాడి కళ్ళల్లోని భయాన్ని చూస్తూ ఇట్నే వచ్చేత్తాగా అంటూ తెప్పను ముందికి పోనిచ్చాడు. “చిన్న తెప్ప సామి” విశ్వనాథశాస్ర్తీని చూస్తూ చెప్పాడు.
విశ్వనాథశాస్ర్తీ తదేకంగా ఈశ్వరయ్యను చూస్తుండిపోయాడు. కళ్ళలోంచి నీళ్ళు ఉబికి వస్తున్నాయి. మనిషిలోంచి మనిషి మాయమవుతున్న ఈరోజుల్లో పరులకోసం తన కుటుంబాన్నే లెక్కచేయలేదంటే ఆ క్షణంలో ఈశ్వరయ్య, గంగాభవాని సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులుగా అగుపించారతనికి అంతే రెండు చేతిలెత్తి నమస్కారం చేశాడు. “అదేంటి సామి. మీరు నాకు దండం పెట్టడం ఏంటి సామి... కంట్లో నీరేంటి సామి ఏమైంది సామి” అడిగాడు ఈశ్వరయ్య.

“నన్ను క్షమించు ఈరయ్య” అని రెండు చేతులు జోడించి అర్థించాడు విశ్వనాథశాస్ర్తీ.

‘‘అదేంటి సామి అట్టా అంటారు. మీరు అట్టా మాట్లాడకూడదు సామి. మీరు బాగుంటేనే కదా ఆ దేముడికి అన్ని జరుగుతాయి. అప్పుడేకదా మాలాంటోరిని దేముడు చల్లంగా చూత్తాడు. మీరు బాగుండాలి సామి’’ అంటూ తెప్పను జాగ్రత్తగా ముందుకు తీసుకెళుతున్నాడు.

సరిగ్గా నెలరోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది విశ్వనాథశాస్ర్తీకి. ఇంటి తలుపులు దబదబా బాదుతుండడం విని ఈ సమయంలో ఎవరా అనుకొంటూ తలుపులు తీశాడు విశ్వనాథశాస్ర్తీ. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని గుర్తుపట్టలేకపోయాడు. వెనక ఓ ఆడమనిషి కూడా వుండడం గమనించాడు. ‘ఎవరు కావాలి’ ప్రశ్నించాడు విశ్వనాథశాస్ర్తీ.

“నేను సామి ఈశ్వరయ్యను. అందరూ ఈశ్వరయ్య అంటుంటారు. చేపలు పట్టి అమ్ముకొనేవాణ్ణి సామి.”
“అయితే ఏంటి ఈ సమయంలో”.

“సామి నా కొడుక్కి చీకట్లో ఏదో పురుగు కుట్టింది. బాధతో అల్లాడుతున్నాడు. సమయానికి డాట్టరు బాబు కూడా లేడు. పక్కూరికి వెళ్ళాడంట. కాస్త చూడండి సామి” అంటూ చేతులు జోడించాడు.
విశ్వనాథశాస్ర్తీకి కాస్త నాటు వైద్యం కూడా తెలుసు.

“ఎక్కడున్నాడు?” అడిగాడు విశ్వనాథశాస్ర్తీ.

అక్కడే అరుగుమీద పడుకోబెట్టిన కొడుకును చూపాడు.

చూసిన వెంటనే చిర్రున కోపం వచ్చింది విశ్వనాథశాస్ర్తీకి ‘‘ఏయ్ ఎక్కడ పడుకోబెట్టేది. బుద్దివుందా నీకసలు. తీసుకెళ్ళి వీధిలో చెట్టుకింద వున్న అరుగుమీద పడుకోబెట్టు. కాసేపాగి వస్తాను” అంటూ అరిచాడు.
‘తప్పయింది సామి మన్నించు’అంటూ కొడుకుని భుజాన వేసుకొని వీధి వైపు పరుగెత్తాడు. ఈశ్వరయ్యను అనుసరించింది అతడి పెళ్ళాం గంగాభవాని.

వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒక బిందెడు నీళ్ళు తెచ్చి అరుగుమీద గుమ్మరించాడు విశ్వనాథశాస్ర్తీ. తెల్లారే గుళ్ళో ప్రత్యేక పూజ వుంది. తొందరగా లేవాలి. మధ్యలో ఈ వెధవ సంత నిద్ర పాడుచేశాడు. తిట్టుకొంటూ నిదానంగా బయలుదేరాడు.
వీధి అరుగు దగ్గరకు చేరేటప్పటికి అక్కడ డాక్టరు ఉమాపతి వుండడం, ఈశ్వరయ్య కొడుక్కి సిరంజి ద్వారా మందు ఎక్కిస్తుండడం చూశాడు.

అమ్మయ్య వచ్చాడా! బ్రతికిపోయాను. లేకపోతే వైద్యం చేసేటప్పుడు వాణ్ణి తాకినందుకు మళ్ళీ సాన్నం చేయవలసి వచ్చేది అనుకొన్నాడు. విశ్వనాథశాస్ర్తీ వచ్చింది గమనించి ఈశ్వరయ్య “సామి డాట్టరు బాబు వచ్చాడు. యిరుగుడు మందిచ్చాడు. భయం లేదన్నాడు. చమించండి సామి. మీకు శమ ఇచ్చాను” అంటూ దండం పెట్టాడు.
సరేసరేనంటూ అక్కడినుంచి వెళ్ళాడు విశ్వనాథశాస్ర్తీ.

ఆరోజు జరిగిన సంఘటన అంతా విశ్వనాథశాస్ర్తీ కళ్ళముందు కదలాడింది. ఎంత నిర్దయగా ప్రవర్తించాను ఆరోజు. సాటి మనిషి ప్రాణంమీదకు వస్తే కాస్త కూడా కనికరం చూపించలేకపోయాను అనుకొంటూ మనసులోనే కుమిలాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో తన వాళ్ళకంటే నా కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చాడు. తనకోసం బ్రతికేవాడు మనిషైతే పరులకోసం బ్రతికేవాడు మహర్షి అని ఎక్కడో చదివినట్టు గుర్తొచ్చింది విశ్వనాథశాస్ర్తీకి. ఇప్పుడు ఈశ్వరయ్య మహర్షిలాగే అగుపించాడతనికి.

ఇవేమి పట్టని ఈశ్వరయ్య తెప్పను గట్టుదగ్గరకు చేర్చే ప్రయత్నంలో వున్నాడు. నేరుగా వాగుకు అడ్డంగా వెళ్తే ప్రవాహ ఉధృతిని తట్టుకోవడం కష్టమని తెప్పను ఎగువకు తీసికెళ్ళాడు. అక్కడైతే వాగు వెడల్పుగా వుండి ఉధృతి తక్కువగా వుంటుందని అలా చేశాడు.

విశ్వనాథశాస్ర్తీ నలుదిక్కులా ఓసారి చూశాడు. కనుచూపుమేర ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. ఏమిటే ప్రకృతి విలయతాండవం. మానవుడు ఎంతో ప్రగతి సాధించాను. అన్నీ తన ఆధీనంలో వున్నాయి అని విర్రవీగుతుంటాడు. అలాంటప్పుడే ప్రకృతి నన్నేమి చేయలేవురా అని విరుచుకుపడుతుంది. ప్రకృతి దృష్టిలో అన్ని, ఒకటే అందరూ సమానమే. రాజు- పేద, పండితుడు- పామరుడు, గుడి- గుడిసె అన్న తేడా లేదు. కులము మతము అన్నవి లెక్కలోకి రావు. ఎంత ఆదరిస్తుందో కోపం వస్తే అన్నింటిని ముంచేస్తుంది. అందుకే మానవుడు ఎప్పుడు ప్రకృతి శక్తికి లోబడే వుండాలి. ప్రకృతిని ఆరాధించాలి, కాపాడుతూ వుండాలి. ఇలా ఎప్పుడు లేని, రాని ఆలోచనలు ముంచెత్తాయి విశ్వనాథశాస్ర్తీని.

‘‘సామి గట్టుదగ్గరకు వచ్చాము ఇక దిగండి’’అని ఈశ్వరయ్య అంటుండగా ఆలోచనలనుండి బయటకు వచ్చాడు. కుటుంబంతో సహా గట్టుమీదకు చేరాడు. చొక్కా జేబునుండి చేతికందిన డబ్బును తీసి ఈశ్వరయ్యకు అందివ్వబోయాడు. ‘ఏంటి సామి దుడ్లు ఎందుకు సామి. మీకాడ దుడ్లు తీసుకోకూడదు సామి’ అంటూ నిరాకరించాడు. “జాగ్రత్త సామి వుంటాను” అని తెప్పను మళ్ళించి తన పెళ్ళాం కొడుకు వున్న వైపు తీసికెళ్ళాడు.
ఎంత నిస్వార్థ జీవి. చిన్నపాటి వైద్యానికి కూడా డబ్బు తీసుకొనేవాడిని. ఇక ఎప్పుడూ తీసుకోకూడదనుకొన్నాడు విశ్వనాథశాస్ర్తీ.

వెళ్తున్న తెప్పను, ఈశ్వరయ్యను చూస్తూ వాడికి వాడి కుటుంబానికి ఏమవకూడదని తలచాడు. ప్రకృతిని నమ్మిన వాణ్ణి, ప్రకృతి మీదే ఆధారపడి బ్రతికేవాణ్ణి ఆ ప్రకృతిశక్తే కాపాడుతుంది. అయినా మనస్సులో వాళ్ళు క్షేమంగా వుండాలని తను రోజు పూజించే పరమేశ్వరుడ్ని వేడుకొన్నాడు. వాళ్ళేకాదు అందరూ బాగుండాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకున్నాడు విశ్వనాథశాస్ర్తీ.

Thursday 1 September 2011

వినాయకచవితి శుభాకాంక్షలు

                                     బ్లాగులోకంలో విహరించే అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు.