Wednesday 8 February 2012

ఎంతో మధురమీ స్నేహం - 26

స్కార్పియో NH7 పై దూసుకెళుతోంది. అభిషేక్ ఏకాగ్రతతో నడుపుతున్నాడు. పక్కనే కూర్చున్న చైతన్య అతన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని పాటపాడుతున్నాడు చైతన్య.
ఇంతలో అతని సెల్ఫోన్ రింగయ్యింది. అన్సర్ బటన్ నొక్కి చెప్పు హారిక! అన్నాడు చైతన్య.
ఎక్కడికెళ్ళావ్? నిన్నటినుంచి కనిపించలేదు! అడిగింది అటువైపున హారిక
నిన్న వైజాగ్ నుండి అభి వచ్చాడు. అప్పటినుంచి జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఏ మలుపు దగ్గర ఎవరు ఎదురవుతారో తెలియట్లేదు
ఇప్పుడెక్కడ వున్నారు?
తాడిపత్రికి వెళుతున్నాము. అదెక్కడ వుంది? ఎందుకెళుతున్నారు అనే ప్రశ్నలు వెయ్యకు. నా పరిస్థితే ఈమధ్యనే చూసిన లవకుశ సినిమాలో లక్ష్మణుడు అడివికి తీసుకెళుతున్నపుడు సీతమ్మకు ఎదురైనా పరిస్థితిలాగుంది. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు వుండే ప్రాంతానికి వెళుతున్నాము. అన్నీ సవ్యంగా జరిగి క్షేమంగా తిరిగి వచ్చాక మిగతా  విషయాలు మాట్లాడుకుందాం! సరేనా!
సరేమరి! వచ్చాక ఫోన్ చెయ్యిఅన్నది హారిక
ఓకే, అలాగే! అంటూ ఫోన్ కట్టేశాడు చైతన్య.
ఎందుకురా నువ్వు అనవసరంగా భయపడుతూ తనని కూడా భయపెడతావ్?అన్నాడు అభిషేక్
రేయ్! నువ్వు తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తావ్! అందుకే భయపడడం లేదు. ఫ్యాక్షన్ సినిమాలు చూసుంటే తెలిసేది నేనెందుకు భయపడుతున్నానో. నా కళ్ళ ముందు ఇప్పుడు సమరసింహా రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆదికేశవరెడ్డి కదలాడుతున్నారు
ముంబయిలో మాఫియా వుందని అక్కడున్న అందరూ గ్యాంగ్స్టర్స్ అవుతారా! ముంబాయికి ఎవరూ వెళ్ళట్లేదా! ఇది కూడా అంతే! అన్నాడు అభిషేక్.
అబ్బా ఏమి కంపారిసన్ రా! అంటుండగా స్కార్పియో కృష్ణా నది బ్రిడ్జ్ దాటింది. పక్కనున్న బోర్డును చూసి ఇది బీచుపల్లి అటారా! కర్నూల్ 50 కీ.మీ వుందట! చెప్పాడు చైతన్య.
సరే! కర్నూల్లో ఆగి టిఫిన్ చేద్దాం! అన్నాడు అభిషేక్.
అరగంట తరువాత కర్నూల్ చేరారు. అక్కడి రాజ్ విహార్ హోటల్లో టిఫిన్ చేసి గంట తరువాత తిరిగి బయలుదేరారు.
ఇది రాయలసీమగడ్డ! గాండ్రించు పులిబిడ్డా! అంటూ మొదలుపెట్టి ఇదివరకు తను విన్న సీమ పాటలు పాడసాగాడు చైతన్య.
గంటన్నర తరువాత వారు గుత్తి చేరారు. కొండ మీది కోట చూసి రేయ్! అభి! ఆ కోటను శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడంటావా! సందేహం వ్యక్తం చేస్తూ అడిగాడు చైతన్య.
చైతన్యను చూస్తూ, శ్రీకృష్ణదేవరాయలా! ఆయనెవరు? అడిగాడు అభిషేక్.
తనవైపు వింతగా చూసి, నీకిప్పుడు చరిత్ర చెప్పలేనుగానీ ముందు చూసి పోనివ్వు! అన్నాడు చైతన్య.
కొద్ది దూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో వారికి ఎటువెళ్ళాలో అర్థం కాలేదు.
అభి! కాస్త సైడుకి ఆపు! ఎవరినైనా అడుగుదాము! అన్నాడు చైతన్య
టీ బంకు పక్కనున్న అరుగుమీద ముగ్గురు వ్యక్తులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి పక్కన ఆపగానే, గ్లాసు దించి, మధ్యలో కూర్చున్న బుగురు మీసాలతన్ని చూస్తూ, అన్నా! తాడిపత్రికి ఎలా వెళ్ళాలి! అడిగాడు చైతన్య.
యాడికి పోయి పోవాలా!అన్నాడతను.
నేనడిగిందే మళ్ళీ చెబుతున్నాడు అనుకొని అదే అన్నా నేను అడుగుతున్నా! తాడిపత్రికి పోవాలంటే ఎలా వెళ్ళాలి
అదే కదా నేనూ చెబుతాన్నా పిల్లోడా! యాడికి పోయి పోవాలా! చెప్పాడు మీసాలతను.
అయ్యో చెప్పిందే చెబుతున్నాడు. తింగరోడిలా వున్నాడు ఎలా అనుకొంటూ డోర్ తెరచి కిందకు డిగాడు చైతన్య.
అన్నా అదికాదు! ఇప్పుడు తాడిపత్రి వుంది కదా! ఆ వూరికి ఎలా వెళ్ళాలి
ఏంది పిల్లోడా! అర్థం కావట్లేదా! యాడికి పోయి పోవాలా! మళ్ళీ అదే చెప్పాడు.
అయ్యో అనుకుంటూ తల పట్టుకున్నాడు చైతన్య. పక్కనున్న వాళ్ళను చూసి, మీరైనా చెప్పండన్నా! అన్నాడు చైతన్య
ఏయ్! ఏంటి తమాషాలు చేస్తున్నావా! పెద్దాయన చెప్తున్నాడు కదా! యాడికి పోయి పోవల్ల!కాస్త కటువుగా చెప్పాడు పక్కనున్నవాడు.
ఏడుపు ఒక్కటే తక్కువైంది చైతన్యకు. మళ్ళీ అడిగితే కొట్టేట్టు వున్నారు. ఇప్పుడెలా అనుకున్నాడు. 

అంతలో అంతవరకూ టీ తాగుతూ వింటున్న ఒకతను కలగజేసుకొని, తాడిపత్రి వెళ్ళాలంటే 'యాడికి' అనే వూరి మీదుగా పోవాలి అని అంటున్నాడతను. తాడిపత్రికి పోవల్ల అంతే కదా! నేను చెప్తా! ఇక్కడినుండి నేరుగా పొండి. Y జంక్షన్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. ఆడ నుండి ఇరవయైదు కిలోమీటర్లు వెళ్ళాక యాడికి  వస్తుంది. దాని దాటి ఇంకో ఇరవయైదు కిలోమీటర్లు వెళితే తాడిపత్రి వస్తుంది చెప్పాడు
బతికించావు అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి స్కార్పియోలో కూర్చొని ఎవరైనా అడ్రస్ అడిగితే అలా చెప్పాలి. మీరూ వున్నారు తిక్కతిక్కగా చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అన్నాడు చైతన్య
ఏంట్రా వాడు గొణుగుతున్నాడు. ఏసైండిరా వాణ్ణి! అన్నాడు మీసాలు మెలేస్తూ .
ఓర్ని అనవసరంగా వాగానే అనుకుంటూ రేయ్ అభి! పోనివ్వరా!  వచ్చేస్తున్నారు అన్నాడు చైతన్య తొందరపెడుతూ.
గేరు మార్చి బండిని ముందుకురికించాడు అభిషేక్.
ఇందాక టీ బంకు దగ్గరతను చెప్పినట్లే Y జంక్షన్ దగ్గర ఎడమవైపుకి తిప్పాడు అభిషేక్.  అరగంట తరువాత యాడికి చేరారు వారు. టైం చూస్తే ఒంటిగంట కావస్తోంది. ఆకలేస్తోంది, ఇప్పుడెలా అనుకొంటుండగా భోజనశాల అని వ్రాసున్న బోర్డు కనపడింది చైతన్యకి. అతని కోరికమేరకు దాని పక్కన ఆపాడు అభిషేక్. ముఖం కడుక్కొని లోపల కూర్చున్నారు ఇద్దరూ.
ఒకతను వచ్చి ఏమి కావాలని అడిగాడు
మీ హొటల్ స్పెషల్ ఏంటి? అడిగాడు చైతన్య
రాగి సంగటి, నాటుకోడి పులుసు చెప్పాడతను
ఇదేంటి రాగి సంగటి! ఎప్పుడూ వినలేదే అని మనసులో అనుకుంటూ ఇంకా ఏమున్నాయి? అడిగాడు చైతన్య
జొన్నరొట్టె, తలకాయ కూర!
వినగానే అదిరిపడ్డాడు చైతన్య. ఎవరి తలకాయ? అడిగాడు భయంగా.
హహ్హహ్హ అని నవ్వుతూ, గొర్రెది అబ్బీ! అన్నాడతను.
ఓహ్ బతికించావు అంటూ అన్నీ మాంసాహారాలేనా, శాఖాహారం లేదా!
స్పెసల్ అని అడిగితివికదాని అవి చెప్పినా! అన్నమూ, పప్పు, చారు వున్నాయి. పెట్టమంటావా అబ్బీ!
సరే! తీసుకురా!  అన్నాడు చైతన్య.
విస్తరి వేసి వడ్డించాడతను. ఏమో అనుకున్నాముగానీ రుచికరంగానేవున్నాయి వంటలు అనుకున్నారు స్నేహితులిద్దరూ. కాసేపు ప్రయాణబడలిక తీర్చుకొని మళ్ళీ బయలుదేరారు వారు. 

వూరు దాటుతుండగా బడిపిల్లలు లిఫ్ట్ కావాలంటూ బొటనవేలు చూపిస్తున్నారు. వెనకంతా ఖాళీనే కదా తీసుకెళదాం అన్నాడు చైతన్య. సరేనని బండి ఆపాడు అభిషేక్.
ఉత్సాహంగా పది మంది పిల్లలు వెనకున్న రెండు వరసల సీట్లు

ఆక్రమించేశారు. మళ్ళీ కదిలింది స్కార్పియో. వాళ్ళను చూస్తుంటే  చైతన్యకు 

తన చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

ఏంట్రా, బడి అప్పుడే అయిపోయిందా! అడిగాడు చైతన్య
అయిపోలేదు. అన్నంతిని మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టాము! అన్నారందరూ నవ్వుతూ.
మరి రేపు వెళితే మాష్టారు అడగరా! మళ్ళీ మీకు భోజనం పెడతారా!
ఎందుకుపెట్టడు. వాడబ్బ సొమ్మా! పెట్టకపోతే సంపేత్తాము అన్నాడొకడు.
అమ్మో! సీమ పౌరుషం కనపడుతోంది అనుకున్నాడు చైతన్య.
ఇంతలో కటకటమని నములుతున్నట్టు వినపడింది. వెనక్కి తిరిగి చూసి ఏంట్రా తింటున్నావు? అడిగాడు చైతన్య.
కమ్మరకట్టు! అన్నాడు పల్లికలిస్తూ.
ఏమి కట్టు!తిరిగి అడిగాడు చైతన్య.
కమ్మరకట్టన్నా! బాగుంటుంది. తింటావా! అన్నాడు చేయిచాచి.
వద్దులే అంటూ పక్కనున్న వాడి చేతిలో బంతి ఆకారంలో వున్నదాన్ని చూసి ఏంటిరా అది!
బొరుగులుండ! కావల్నా! అన్నాడు వాడు.
ఏమి వుండరా బాబూ! బాంబులాగుంది. నువ్వు తిను! అన్నాడు చైతన్య.

ఇది బాంబట రోయ్! అని అరిచాడు వాడు. మిగతా వారు గొల్లున నవ్వారు. 
 "ఏ వూరురా మీది? అడిగాడు చైతన్య
వీరా రెడ్డి పల్లి చెప్పాడొకడు
వూరి పేరులో కూడా సీమ మార్క్ వుందని చైతన్య అనుకొంటుండగా, అన్నా, ఇక్కడాపు! అరిచారందరూ.
అభిషేక్ ఆపాడు. బిలబిలమంటూ దిగారందరూ. ప్రతిఒక్కరూ వచ్చి థ్యాంక్స్ అన్నా! అంటూ ఇద్దరికి షేఖ్హాండ్ ఇచ్చారు.
వారికి బై చెప్పి ముందుకు కదిలారు అభిషేక్ చైతన్యలు. మరో అరగంట ప్రయాణం తరువాత తాడిపత్రి చేరారు వారు. 

చేరగానే ముందురోజు జోసెఫ్ రెడ్డి దగ్గర తీసుకున్న నెంబరుకు ఫోన్ చేశాడు అభిషేక్. అటువైపు ఫోన్ రింగవుతోంది. అభిషేక్ గుండె వేగం పెరుగుతోంది. ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలిసింది అతనికి. హల్లో! అన్నాడు మెల్లగా.
హల్లో! ఎవరు కావాలి? అన్నారు అటువైపున.
ఇదేంటి దివ్య మాట్లాడుతుంది అనుకుంటే ఎవరో ముసలి గొంతు వినపడుతోంది. అంటే ల్యాండ్ నెంబర్ ఇచ్చాడన్నమాట అని మనసులోనే తలచి, దివ్య వుందా! అడిగాడు అభిషేక్.
ఇంట్లో లేదు! ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఇంతకూ మీరెవరు?అడిగాడు అటువైపాయాన.
నా పేరు అభిషేక్. దివ్య ఫ్రెండుని. ఏ గుడికి వెళ్ళింది తను!
ఏటిగట్టు నుండే బుగ్గరామలింగేశ్వరాలయానికి వెళ్ళింది చెప్పాడాయన
థాంక్స్ అని పెట్టేశాడు అభిషేక్. పక్కనే వున్న ఆటో వాడిని అడిగాడు ఆ గుడికి దారెటని. అతను చెప్పాక స్కార్పియోను ఆ దారి వైపు పోనిచ్చాడు.
ఇప్పుడు వచ్చిన దారినే మళ్ళీ వెళుతున్నాము కదరా! అడిగాడు చైతన్య.
అవును! మనమోచ్చింది గట్టు పక్కనుండే కదా! చెప్పాడు అభిషేక్.


బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ ముఖద్వారం (లోపలి వైపు)
మరలా ఒకరిద్దరి దగ్గర వాకబు చేసి దేవాలయానికి చేరుకున్నారు వారు. పాదరక్షలు బయట వదిలి లోనికి ప్రవేశించారు. 

దివ్య కోసం చుట్టూ కలయతిరిగారు. అభిషేక్ మరింత ఆత్రుతగా వెతకసాగాడు ఆమె కోసం. 
ఈలోగా వారికి ఏటిలోకి దారితీసే మెట్లు కనపడ్డాయి. అటువైపుగా వెళ్లారు.

 క్రింది వైపున చివరి మెట్టు మీద ఒక అమ్మాయి కూర్చోని వుండటాన్ని గమనించారు ఇద్దరూ. వెనుక నుండి ఆమెను చూడగానే తను దివ్య అని గుర్తుపట్టాడు అభిషేక్.
మెల్లగా ఒకొక్క మెట్టుదిగుతున్నాడు అభిషేక్. అతడిని అనుసరించాడు చైతన్య.
తనని సమీపించగానే, హాయ్ దివ్! అన్నాడు అభిషేక్.

విన్న ఆ అమ్మాయి గిర్రున తలతిప్పి చూసింది.
అభిషేక్ ని చూడగానే, ఎక్స్పెక్ట్ చేశాను నువ్వువస్తావని. కానీ ఇంత తొందరగా వస్తావనుకోలేదు అన్నది
ఎలా వున్నావు దివ్! అడిగాడు అభిషేక్
ఇప్పటివరకు బాగానే వున్నాను. కానీ నన్నలా పిలువకు....అలా పిలిచే అర్హత పోగొట్టుకున్నావ్! యు లాస్ట్ దట్ రైట్!
ఐ యాం సారీ దివ్!

ఇట్స్ టూ లేట్ అభి!

ఆలయం ప్రక్కన్న పెన్నానది తీరం
అక్కడ నిశబ్దం అలుముకుంది. ఏటిలో ఈత కొడుతూ అరుస్తున్న వారి అరుపులు, బట్టలుతుకుతున్న వారు చేసే శబ్దాలు వినపడుతున్నాయి.

మళ్ళీ ఏటి వైపుకి తలతిప్పి చూడసాగింది దివ్య.
కొద్దిక్షణాలు అలాగే గడిచాయి. చైతన్యకు అయోమయంగాను, ఇబ్బందిగాను వుంది.  ఏదో ఒకటి మాట్లాడాలని ఈ నది పేరేంటండిఅడిగాడు.
తల వెనుకకి తిప్పి అభిషేక్ ని చూస్తూ, “హు ఈజ్ దిస్ గై? అడిగింది దివ్య
అభిషేక్, చైతన్య చేతిని పట్టుకొని దివ్య ముందుకు వచ్చి, చైతన్య! నా బెస్ట్ ఫ్రెండ్!అని దివ్యకి చూపిస్తూ చెప్పి, చైతూ! ఈమె దివ్య, దివ్యారెడ్డి! నిన్న మనం వీళ్ళ ఇంటికే వెళ్ళింది! అన్నాడు
హాయ్! అన్నాడు చైతన్య
చైతన్యని ఎగాదిగా చూస్తూ హాయ్! అంది దివ్య. మళ్ళీ తనే ఇది పెన్నా నది! ఇలా నీరెండలో ఏటి పక్కన కూర్చోని, గుడిగంటల శబ్దం వింటూ టైం స్పెండ్ చేయడం నాకిష్టం!” చెప్పింది.
అవునూ, మీ నాన్నగారి పేరేమో జోసెఫ్ రెడ్డి...మీ ఇంట్లో హోలీ క్రాస్ ఫ్రేమ్ కూడా చూశాను. అంటే మీరు కన్వర్టర్డ్ క్రిస్టియన్స్ కదా! మరి ఇలా గుడి పక్కన కూర్చున్నారు సందేహం వెలబుచ్చాడు చైతన్య.
చైతన్యను కోపంగా చూసి అభిషేక్ వైపు తిరిగి నువ్వే పెద్ద తేడా అనుకుంటే నీ కంటే పెద్ద తేడాగాడులా వున్నాడు అంటూ లేచి వెనక్కు తిరిగి మెట్లు ఎక్కసాగింది దివ్య.
ఏంటిరా ఈమె ఇలా మాట్లాడుతోంది అని సైగలు చేస్తూ అడిగాడు చైతన్య.
కాసేపు గమ్మునుండు నేను మాట్లాడుతాగా అని తను కూడా సైగలు చేస్తూ చెప్పాడు అభిషేక్.
దివ్య పైమెట్టు దగ్గర ఆగి వెనక్కు తిరిగి ఏంటి అక్కడే సెటిలవుతారా! ఓకే, బై! అని గుడిలోకి వెళ్ళింది.
లేదులేదని అని ఒక్క ఉదుటున వాళ్ళు కూడా గుడిలోకి వచ్చి ఆమెను అనుసరించారు.
ఎప్పుడు తిరుగు ప్రయాణం. తొందరగా బయలుదేరితే మంచిది...అర్ధరాత్రికి హైదరాబాద్ చేరవచ్చు! అన్నది దివ్య
ఏమీ మాట్లాడకుండా నడవసాగారు అభిషేక్ చైతన్యలు.
ఆమె ఆగి, “ఎలాగూ వచ్చారు కదా మా గుడిని చూసి వెళ్ళండి! అన్నది.
మా గుడి అంట....మీ తాతేమైనా కట్టించాడా అని మనసులో అనుకున్నాడు చైతన్య.
ఏంటి ఆ ఫేసు! మా గుడి అంటుంది....మీ తాతేమైనా కట్టించాడా అని అనుకుంటున్నావా! మా గుడి అంటే మా వూరి గుడి అని అర్థం! అంటూ అర్థమయ్యిందా అన్నట్టు చూసింది చైతన్యని దివ్య.
అయ్యబాబోయ్! ఆవులిస్తే పేగులు లెక్కెట్టేట్టు వుంది అనుకున్నాడు చైతన్య.
మరేమనుకున్నావ్ జాగ్రత్త అన్నట్టు చూసి, రండి మా వూరి గుడి చూపిస్తాను! అంటూ ముందుకు కదిలింది దివ్య.
ఆమె పక్కనే నడిచారు ఇద్దరూ.
చూడండి! ఈ స్థంభాలపై నాట్య భంగిమలు. ఎంత అద్భుతంగా చెక్కారో. వీటిని సాలభంజికలు అంటారు!”  అని చూపించింది.
సూపర్! శిల్పి ఏ బిపాసాబసునో, ఏ తమన్నానో తలుచుకుంటూ చెక్కుంటాడుఅన్నాడు చైతన్య.
కోపంగా చూసి నిజంగా వీడు తేడా! అంది దివ్య
కాసేపు గమ్మనుండరా! అన్నాడు అభిషేక్ చైతన్యను చూస్తూ.
మళ్ళీ దివ్యని చూసి నువ్వు చెప్పు దివ్! అన్నాడతను.
ఇది చూడండి! చెట్టు కొమ్మపై రామచిలుకలు, ఇంకొక పక్క కోతులు, కింద నెమళ్ళు! ఎంత బాగా చెక్కారో చూడండి!
నిజమే ఎంత బాగా చెక్కారు శిల్పులు అనుకున్నారు స్నేహితులిద్దరూ.
ఈ గుడిని ఎవరు కట్టించారండి! అడిగాడు చైతన్య.
విజయనగర రాజుల కాలంలో తాడిపత్రి ప్రాంత మండలలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయుడు కట్టించాడు చెప్పింది దివ్య
ఇక్కడికి రండి! అంటూ ఒక స్తంభం దగ్గర నిలబడి వీటిపై చిన్నగా మీటితే సరిగమలు పలుకుతాయి తెలుసా! అని తన చేతిలోని కీసుతో  మూల స్థంభం చుట్టూ వున్న చిన్న స్తంభాలపై చిన్నగా మోదుతూ వుంటే సరిగమలు పలుకుతున్నట్టే వినిపించింది వారికి.

ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఇలాంటి అద్భుతం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు వారు.
ఇలాంటి స్తంభాలే హంపీలో కూడా వున్నాయి! అన్నది దివ్య.
ఇక్కడ చూడండి! ఈ గుడి బరువంతా తన చేతులు, భుజస్కందాలపై మోస్తున్నట్టు వుందీ శిల్పంచూపించింది దివ్య.
వావ్! అభి చూడరా! ఆ సిక్స్ ప్యాక్ బాడీ....ఏ జిమ్ వెళ్ళాడో! అన్నాడు చైతన్య
అయ్యో! చూస్తున్నానులేరా! నువ్వు గమ్మనుండు! అని సైగలతో చెప్పాడు అభిషేక్.
అలా గుడి అంతా కలయతిప్పుతూ చూపించింది దివ్య.

ఈలోపు సాయంసంధ్య అవుతుండడం గమనించి రండి సన్సెట్ చూద్దాం! అంటూ మళ్ళీ ఏటిగట్టు వైపుకి తీసుకెళ్ళింది వారిని.
కాసేపు సూర్యాస్తమాన్ని చూస్తుండి పోయారు ముగ్గురూ.
తన మూడ్ బాగున్నట్టుందని దివ్యా! నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి! అడిగాడు అభిషేక్.
తనవైపొకసారి చూసి మళ్ళీ సూర్యుడివైపు తిరిగి ఏముంది మమ్మీ,డాడీ పెళ్ళిచేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేనుకూడా ఓకే చెబుదామని అనుకుంటున్నాను అన్నది దివ్య
మరి నీవు అంత కష్టపడి ఫిలిం మేకింగులో బ్యాచిలర్స్ చేశావు కదా! నీ టాలెంటిని ప్రూవ్ చేసుకోవాలని లేదా!అడిగాడు అభిషేక్
అంత శ్రమ ఎందుకు అనిపిస్తుంది. స్క్రిప్ట్ రాయడం... ప్రొడక్షన్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం... ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం... ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది! హాయిగా పెళ్ళిచేసుకొని సెటిలయిపోక!చెప్పింది దివ్య.
సరే! కథ రెడీగా వుంది, డైరెక్షన్ చెయ్యమంటే చేస్తావా!
కథ వుంటే సరిపోతుందా! మరి ప్రొడ్యుసర్!
మనమే! అంటే నేనే ప్రొడ్యూస్ చేద్దామని!సణిగాడు అభిషేక్.
నో వే! నువ్వు ప్రొడ్యుసర్ అయితే నేను కోటి రూపాయిలిచ్చినా చెయ్యను!
ప్లీజ్ దివ్! అలా ఫ్రీజ్ అవ్వకు! ఒక్కసారి ఆలోచించు!
నో! ఐ కాంట్!
ప్లీజ్ దివ్! నా మీద కోపంతో అలా హార్ష్ డెసిషన్ తీసుకోకు!
తన స్నేహితుడి పరిస్థితి చూసి రేయ్! ఎందుకురా అంతగా బతిమాలుతావు లోకంలో ఇంకెవ్వరూ లేనట్టు!  హైదరాబాదులో కృష్ణానగర్లో కూత వేస్తే వెయ్యి మంది లైన్లో నిలుచుంటారు డైరెక్షన్ చేస్తామని. అదీ ఒక్క పైసా ఆశించకుండా! ఇందుకేనా ఈ తొక్కలో తాడిపత్రికి వచ్చిందిఅన్నాడు కోపంగా చైతన్య.
ఏయ్! ఏంటి తొక్కలో తాడిపత్రి అంటున్నావు. మా వురిని ఏమైనా అంటే నిన్ను ఏట్లోకి తోసేస్తా! మూడు తరాలు దాటినా ఇంకా తెలుగు సినిమాలకు తలమానికంగా వున్నది... ప్రపంచంలోని చాలా ఫిలిం స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా వున్న తెలుగు సినిమా స్క్రిప్ట్ ఏంటో తెలుసా!” అడిగింది దివ్య.

మాయా బజార్ సెట్స్ పై దర్శకులు కె.వి.రెడ్డి
ఆ...ఎందుకు తెలీదు. మాయా బజార్చెప్పాడు చైతన్య.
ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా! ఆయనది ఏ వూరో తెలుసా!
కె.వి.రెడ్డి. ఆయనది ఈ వూరేనా? అయితే ఏంటట! అన్నాడు చైతన్య.

"అవును మరి తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని, మావూరిని తక్కువ చేసి మాట్లాడతావ్!" అడిగింది

"అదేదో సామెత...ఆ....మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది. ఆయన పేరుముందున్న కె, చివరన రెడ్డి పెట్టుకొని కె.డి.రెడ్డి గా నిన్ను నీవు పెద్దగా వూహించేసుకుంటున్నావు! అంత తోపా నువ్వు! అలాంటి గుర్తుండిపోయే సినిమా నువ్వు తీయగాలవా!” రెచ్చగొట్టాడు చైతన్య.

అభీ వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నువ్వు కంట్రోల్ చేస్తావా? నన్ను చేయమంటావా? అన్నది ఆవేశంగా దివ్య.
నువ్వు ఆవేశపడకు నేను చూసుకుంటా కదా!  అని చైతన్య వైపు తిరిగి రేయ్! ఇంకోసారి నోరు విప్పావంటే చంపేస్తాను! అని తన నోరు గట్టిగా మూసాడు అభిషేక్.
మళ్ళీ దివ్య వైపు తిరిగి వాడి మాటలేవీ పట్టించుకోకు! నువ్వు ఒకసారి ఈ కథ చదువు! ఆ తరువాత నీ ఇష్టం!అని తన చేతిలోని కథాపుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు.
వై షుడ్ ఐ! నాకవసరం లేదు! అన్నది అభిషేక్ చేతిని తోస్తూ.
ప్లీజ్ దివ్! ఒక్కసారి చదివి డెసిషన్ తీస్కో! అని మళ్ళీ పుస్తకాన్ని తన చేతిలో పెట్టాడు అభిషేక్.
మళ్ళీ తోసేయడానికి ప్రయత్నిచింది దివ్య. పడిపోతున్న పుస్తకాన్ని అందుకుంటుండగా ఏటిగాలికి పేజీలు కదిలాయి. పేజీల కదలికలో ఆ కథ టైటిల్ కనపడింది దివ్యకు. పుస్తకాన్ని ఒడుపుగా పట్టుకొని మొదటి పేజీని తిప్పగానే దానిపై వ్రాసున్న కథ పేరు చూసింది. ఎంతో మధురమీ జీవితం! if someone shares love & life. శీర్షికతో పాటు ఉపశీర్షికను చదవగానే ఏదో పులకింతకు లోనయింది. ఎంత మంచి టైటిల్. టైటిలే ఇంత బాగుంటే కథ ఎంత బాగుంటుందో అనిపించింది ఆమెకు. క్షణకాలం అలోచించిన తరువాత సరే చదువుతాను! నువ్వు చెప్పావని కాదు, ఈ టైటిల్ కోసం! అన్నది దివ్య అభిషేక్ ని చూస్తూ.
“హమ్మ, చదువుతానన్నావు! అది చాలు! అన్నాడు అభిషేక్. ఒక్కసారి చదివితే ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నమ్మకంతో. అతని నమ్మకం ఆ కథ మీద కాదు. అసలుకి కథే చదవలేదు అతడు. ఆ నమ్మకం తన స్నేహితుడు శ్రీరామ్ మీద మరియు కథ గురించి చెప్పిన మహాలక్ష్మి మాట మీద.
వెళ్దామా! అన్న దివ్య మాటతో ఆలోచనల నుండి బయటపడి సరే అన్నాడు అభిషేక్.
ముగ్గురూ అక్కడి నుండి కదిలారు.

ఇంకా వుంది.......