నేను వ్రాసి పంపిన కథ చరిత మరువకు భవిత! స్వప్న మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో మూడవ బహుమతి గెలుచుకున్నది. బ్లాగర్లు కూడా ఈ కథను చదివి తమ అభిప్రాయం తెలుపగలరని ఆశిస్తున్నాను.
సమయం తొమ్మిది కావస్తోంది. ప్రతి ఒక్కరు వెనక ఎవరో తరుముతున్నట్టు పరిగెడుతున్నారు.
టాంక్ బండ్ ఫై త్యాగయ్య, రామదాసు విగ్రహాల మద్య కుటుంబముతొ సహా కూర్చున్న మల్లయ్య చాలా దిగాలుగా ఉన్నాడు. ఈ రణగొణ ధ్వనులు మరింత చికాకును కలిగిస్తున్నాయతనికి. మల్లయ్య వ్యవసాయ కూలి. అతని పెళ్ళాం కూడా కూలీనే. రెండేళ్ళుగా వానలు లేక వూరు కరువుబారిన పడింది. వాళ్ళవూరే కాదు చుట్టపక్కల వూళ్ళ పరిస్థితి కూడా అదే. ఊళ్ళల్లో పనులు లేక బ్రతుకుతెరువు కోసం అందరూ వలసల బాట పట్టారు.
మల్లయ్య నగరానికి వచ్చి రెండు రోజులైంది. భద్రయ్య జాడ తెలిసికోలేక పోతున్నాడు. వాళ్లిద్దరిది ఒకే వూరు. రెండేళ్ళ క్రితమే భద్రయ్య పెళ్ళాం పిల్లలతో వలస వచ్చాడు. మొదట్లో రోజు కూలిగా పనిచేస్తూ అక్కడే వాచ్ మాన్ గా కుదిరాడు. అతన్ని నమ్మి ఏదో ఒక పని కుదర్చక పోతాడా అని నగరానికి వచ్చాడు మల్లయ్య. కాని భద్రయ్య పనిచేసే భవంతి నిర్మాణం పోయిన నెలలోనే పూర్తయి అది ఒక ప్రయివేటు కంపెనీ ఆధీనంలోకి వచ్చిందని, భద్రయ్య గురించి తనకేమి తెలీదని ఇప్పుడు అక్కడ పని చేస్తున్న సెక్యురిటి గార్డ్ చెప్పాడు. నగరంలో భద్రయ్య తప్ప ఇంకొకరు తెలీదు. ఇప్పడు ఎటు పోవాలో, ఏమిచేయాలో దిక్కుతోచడం లేదతనికి.
“నాయనా! ఇప్పుడేమి చేద్దాం? తిరిగి మన వూరికి పోదామా?” అని అడిగాడు కొడుకు గణేష్. తిరిగి వూరెళ్తే మద్యలో వదలేసి వచ్చిన చదువును కొనసాగించ వచ్చని వాడి ఆలోచన.
“ఇంక వూరికి పోయేది లేదు. కనీసం ఒక ఏడన్నా ఇక్కడే ఏదో ఒక పనిచేసుకొని బ్రతకాలి. వచ్చే ఏడన్నా వూళ్ళో మంచి వానలు పడితే అప్పుడు ఆలోచిస్తాము” అన్నాడు మల్లయ్య.
నిరాశగా తలమరల్చి ఎదురుగా కనపడుతున్న తథాగతున్ని చూస్తూండి పోయాడు గణేష్.
ఇంతలో ఉన్నట్టుండి అక్కడ అలజడి మొదలైంది. ఒకటోకటిగా ప్రభత్వ వాహనాలు వచ్చి ఆగాయి. ఓ గంట సేపు అధికారులు తమలో తాము చర్చించికున్నారు. చివరలో మీడియాకి ఇంటర్వులు ఇచ్చి వెళ్లిపోయారు. దూరంగా కూర్చొని ఇదంతా గమనిస్తున్న మల్లయ్యకు, అతని కుటుంబానికి ఏమీ అర్థమవలేదు.
అందరూ వెళ్ళాక అక్కడ మిగిలివున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి,“ “సారూ! ఏంటి ఈ అడావుడి?” అడిగాడు మల్లయ్య.
అతడు ఆ చుట్టుప్రక్కల మునిసిపాలిటి పనుల పర్యవేక్షణ అధికారి యాదగిరి.
మల్లయ్యని ఎగాదిగా చూస్తూ, "అక్కడ ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా”? అడిగాడు.
అతను చూపించిన విగ్రహం వైపు చూస్తూ తెలీదన్నాడు మల్లయ్య.
నాకు తెలుసు, అది విజయనగర చక్రవర్తి “శ్రీకృష్ణదేవరాయలు” చెప్పాడు గణేష్.
“కరేక్ట్. “అతడు రాజయ్యి ఐదు వందల సంవత్సరాలు అయ్యిందట. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పది రోజుల్లో టాంక్ బండ్ మొత్తం కళకళలాడాలట. విదేశీయులు కూడా వస్తున్నారట. ఏర్పాట్లు బ్రంహాడంగా వుండాలని ఆదేశించి వెళ్లారు” చెప్పాడు యాదగిరి.
కాని యాదగిరికి ఆందోళనగా వుంది. తనక్రింద పనిచేసే ఆడవాళ్ళు ఇద్దరు తమ వ్యక్తిగత కారణాలవల్ల నెలరోజులపాటు పనికి రామని చెప్పారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ఉత్సవం వచ్చి పడింది. ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాడు.
“సారూ! మాకిక్కడ ఏదన్న పని దొరుకుతుందా?” అడిగాడు మల్లయ్య. సమాధానం వచ్చేలోపే తమ కథంతా చెప్పి దయచేసి ఏదన్న పని ఇప్పించమని వేడుకొన్నాడు.
“సరే! ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఓ వారం రోజుల పనివుంది టాంక్ బండ్ ఈ చివరి నుండి ఆ చివర వరకు పూలచెట్ల పొదలను, వాటి పాదులను సరిచేయాలి. మరియు గడ్డిని సమాంతరంగా కత్తిరించాలి. ఇంకా చిన్న చిన్న పనులు చేయాలిమరి. చేస్తావా?” అడిగాడు యాదగిరి.
“అదెంత పనిసారూ. మాకు తెలిసింది అదే కదా. పని ఇప్పించండి మీరు వూయిందాని కంటే బాగా చేసి చూపిస్తాము” బదులిచ్చాడు మల్లయ్య.
“సరే, ఈరోజు నుండి పని మొదలెట్టండి. కావలిసిన పనిమూట్లు పంపిస్తాను. కాని పైసలు పనైన తరువాతే ఇస్తాము.
“అట్లాగే కాని సారూ” అంటూ దండం పెట్టాడు మల్లయ్య.
“మరి మీరుండేది ఎక్కడ?’ ప్రశ్నించాడు యాదగిరి. ఏమి చెప్పాలో తెలీయలేదు మల్లయ్యకి.
“సరే .. ఇక్కడే దగ్గర్లో బస్తీ ఉంది. ఏదో ఒక ఏర్పాటు చేస్తాన్లే!” అంటూ మోటారుసైకిల్ ఫై వెళ్లిపోయాడు.
కాసేపటి పనిమూట్లు వచ్చాయి. పని మొదలెట్టారు మల్లయ్య మరియు అతని పెళ్ళాం పార్వతి. గణేష్ టాంక్ బండ్ మీదున్న తెలుగు వెలుగుల విగ్రహాలను ఒకటొకటి చూస్తూ, వాటిలో తనకు తెలిసిన వారు, వారి గురించి చదువుకున్న, ఉపాద్యాయులు చెప్పిన విషయాలను గుర్తుచేసికొంటున్నాడు.
సాయంత్రం అయ్యింది. యాదగిరి వచ్చి బస్తీలో వారి వసతి గురించి చెప్పాడు. “చాల సంతోషం సారూ. మీ మేలు ఎప్పటికి మరిచిపోము” అంటూ కృతజ్ఞత నిండిన మనసుతో చెప్పాడు మల్లయ్య.
గణేష్ రామదాసు విగ్రహం ముందు నిల్చొని ఆయన గురించి తను చదువుకున్న సంగతులను మననం చేసికుంటున్నాడు. ఇంతలో విగ్రహం వెనుకవైపు నుంచి చిన్నగా ఏడుపు వినిపించిందతనికి. వెళ్లి చూసాడు. అక్కడ ఓ అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. దొరబాబు లాగున్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నాడో! అడుగుదామా, వద్దా అని తటపటాయించాడు. చివరకు అడిగాడు ఏమైందని. కళ్ళు తుడుచుకున్నాడే కాని సమాధానం లేదు.
కాసేపైన తరువాత గణేష్ అతని ప్రక్కన కూర్చొంటూ, నీ పేరేమిని అడిగాడు.
“కార్తీక్” సమాధానం ఇచ్చాడు.
“ఎందుకు ఏడుస్తున్నావు?”
సమాధానం లేదు.
“కాసేపు నేను నీ ఫ్రెండు అనుకో. మరి ఫ్రెండు దగ్గర ఏమీ దాచకూడదు కదా! ఇప్పుడు చెప్పు!” అడిగాడు గణేష్
మళ్ళీ సమాధానం లేదు.
కాసేపు తరువాత తన ప్రక్కలో వున్న బ్యాగు నుంచి ట్రోఫి మరియు మెడల్ తీసి చూపిస్తూ, “ఈరోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగింది. నాకు “చాంపియన్షిప్” వచ్చింది అన్నాడు కార్తీక్.
“మరి సంతోషమే కదా! ఎందుకేడుస్తున్నావు?”
“కానీ, నేను తీసికొంటుండగా చూడడానికి మా మమ్మి, డాడి రాలేదు. పైగా మా డాడీకి ఈ స్పోర్ట్స్, అన్నా గేమ్స్ అన్న ఇష్టం ఉండదు. టైం వేస్ట్, స్టడీస్ పాడవుతాయి అంటారు.”
“మీ నాన్న, అదే మీ డాడి ఏమిచేస్తుంటారు?’
“డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్” చెప్పాడు కార్తీక్.
“మరి మీ మమ్మి?”
“తను సోషియాలజిస్ట్. పాలిటిక్స్ లో చేరి పెద్ద పేరు తెచ్చుకోవాలనిది ఆమె గోల్.”
“మరెందుకు రాలేదు వాళ్ళు?”
“డాడికేమో సెమినార్ వుందట. ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారట, మమ్మికేమో ఢిల్లీలో మీటింగ్ వుందట” చెప్పాడు కార్తీక్.
“మరి వాళ్ళు రాకపోవడానికి సరైన కారణాలే ఉన్నాయి కదా!”
“వాళ్ళెప్పుడు ఇంతే. ఎప్పుడూ రారు. ఏదో ఒక రీజన్ ఉంటుంది వాళ్లకు చెప్పడానికి”
“అలా ఎందుకనుకొంటావు. వాళ్ళు కష్టపడితేనే కదా నీవు మంచి స్కూల్లో చదవగాలుగుతావు. ఇంతకీ మీ స్కూల్ పేరేమే? నీవు ఏ క్లాస్?”
“ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్”, సెవెంత్ క్లాస్.”
“అంటే! ఏడవ తరగతి. నేను కూడా ఏడవ తరగతే. కానీ మద్యలో ఆపేయాల్సివచ్చింది.”
“ఎందుకు?” ప్రశ్నించాడు కార్తీక్.
“మా వూళ్ళో పనుల్లేక మేమంతా ఇక్కడకి వచ్చేసాము”
అర్థమయి, కానట్టు చూసాడు కార్తీక్.
అంతలో గణేష్ కోసం మల్లయ్య వెతుక్కుంటూ వచ్చాడు. “నాయనా గణేష్!. సారు మనకోసం వసతి చూసాడంట, రా! వెళదాము “అంటూ ప్రక్కనే ఉన్న కార్తీక్ ని చూస్తూ, “ఎవరీ అబ్బాయి?” అడిగాడు.
“మా ఫ్రెండ్ కార్తీక్ నాయన. కార్తీక్ వైపు చూస్తూ “ఇంటికి వెళ్ళు మీ మమ్మి డాడి కంగారు పడతారు”” అన్నాడు గణేష్.
వాళ్ళు వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు కార్తీక్. ఇంటికి పోవాలనిపించట్లేదతనికి. ఇంటికి పొతే ఏముంది. బొమ్మకి కీ ఇచ్చినట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు పనివాళ్ళు. నా హ్యపినేస్ ఎవరూ షేర్ చేసుకోరు అనుకుంటూ బాధతో మూలిగాడు.
మళ్ళీ తెల్లారింది. మల్లయ్య తన కుటుంబంతో టాంక్ బండ్ మీద పనికి ఉపక్రమించాడు.
గణేష్ తను ముందు రోజు కార్తీక్ ని కలసిన రామదాసు విగ్రహం దగ్గరకు వచ్చాడు. విగ్రహం వెనుక వైపు పడుకొని వున్న కార్తీక్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో! అనుకుంటూ తట్టి లేపాడు.
కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తున్న కార్తీక్ ని, “ఏంటి ఇక్కడే ఉన్నావు? ఇంటికి పోలేదా?” ప్రశ్నించాడు గణేష్
లేదని అడ్డంగా తలూపాడు.
“మీ మమ్మి డాడి నీ కోసం వెతుకుతుంటారు కదా పాపం!”
“వెతకనీ. నా ఫీలింగ్స్ వాళ్లకు పట్టలేదు. నాకు వాళ్ళ ఫీలింగ్స్ అక్కరలేదు.”
“అలా అనకూడదు. రా! ఎక్కడనుంచైనా ఫోన్ చేద్దాం” అంటూ పైకి లాగాడు.
“ఏయ్ వదులు. నీ పని చూసుకో పో!” అంటూ చేయి విదుల్చుకొని తోసాడు.
ఇక బలవంతం చేయకూడదని, “సరే నీ ఇష్టం. కాని ఎమన్నా తిన్నావా అసలు?” అడిగాడు గణేష్.
“నీకెందుకు?” అని నిర్లక్ష్యంగా చూసాడు కార్తీక్.
“నేను నీ ఫ్రెండుని. వుండు ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్లి పావు గంట తరువాత వచ్చాడు. “ఇదిగో బిస్కెట్స్, తిను.
ఏమీ తినకపోతే పైత్యం చేస్తుంది” అంటూ ప్యాకెట్ అందించాడు.
కాసేపు బెట్టు చేసినా తరువాత ప్యాకెట్ అందుకొని బిస్కెట్స్ తింటూంటే, “మరి ఇంటికి వెళ్ళనంటున్నావు, ఇప్పుడు ఏమి చేద్దామనుకొంటున్నావు!” అడిగాడు గణేష్.
“ఏమో!” ఎటో చూస్తూ చెప్పాడు . తిన్నాక వాటర్ బాటిల్ లో కొద్దిగా మిగిలి ఉన్న నీళ్ళు తాగాడు. ఇప్పుడు కాస్త స్థిమిత పడ్డాడు.
“థ్యాంక్స్” చెప్పాడు గణేష్ కి.
ఇంతలో ప్రభుత్వ అధికారులు కొంతమందితో వచ్చి, తమతో వచ్చిన వాళ్లకు ఉత్సవ వేదిక గురించి, విద్యుత్దీపాలంకరణ గురించి ఆదేశాలు ఇస్తున్నారు. దీనిని ఆసక్తిగా గమనిస్తున్నాడు గణేష్. వాళ్ళ వూర్లో కూడా తిరునాళ్ళు, జాతర జరిగేటప్పుడు ఇలాంటి ఏర్పాట్లే చేస్తుంటారు. అరగంట హడావుడి చేసి వెళ్లారు.
“ఎవరు వాళ్ళు? ఏమి చెబుతున్నారు?” అడిగాడు కార్తీక్.
“రెండువారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దాని ఏర్పాట్లు చూస్తున్నారు.”
“ఉత్సవాలంటే? “
“ఫంక్షన్ లాంటిది” చెప్పాడు గణేష్.
“ఏమి ఫంక్షన్?”
“శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి ఐదువందల సంవత్సరాలయ్యయని”
“శ్రీకృష్ణదేవరాయలా! అయన ఎవరు? పట్టాభిషేకం అంటే?”
“శ్రీకృష్ణదేవరాయలేవరో తెలీదా? “అదిగో ఆ కనిపించే బొమ్మ ఆయనదే”, చూపించాడు గణేష్. మళ్ళి తనే, “పట్టాభిషేకం అంటే రాజవడం”
“అయితే, దానికి ఇదంతా చేయడం ఎందుకు?”
“ఆయన గొప్పతనం గుర్తుచేసుకోవడానికి”
“ఏమి చేసాడు?”
“తెలుగు భాషకు చాలా సేవ చేసాడు. అవునూ! నీవు ఇవన్ని చదువుకోలేదా?” ప్రశ్నించాడు గణేష్
“లేదు. మా సబ్జక్ట్స్ లో ఇవన్ని వుండవు. నాకు తెలుగు తెలీదు. రాయడం రాదు, చదవడం రాదు”
“ఏంటి! తెలుగువాడయుండి తెలుగు తెలీదా? నీకు తెలుసా శ్రీకృష్ణదేవరాయలు అసలుకి తెలుగువాడు కాదు. అయినా తెలుగు నేర్చుకొని తెలుగులో “”ఆముక్తమాల్యద”” అనే గ్రంధం రాసాడు”
“తెలుగువాడు కాకపోయినా తెలుగులో బుక్ రాసాడా? ఓహ్! హి ఈస్ గ్రేట్”.
“అంతేనా! ఆయన గొప్పతనం ఇంకా చాలా వుంది. ఆయనకు మనవాళ్ళు ఇచ్చిన బిరుదు “ఆంధ్రభోజుడు”
“బిరుదంటే?” అడిగాడు కార్తీక్.
“బిరుదంటే.......ఆ ఇప్పుడు మనం చిరంజీవిని “మెగాస్టార్” అని, జూ.ఎన్.టి.ఆర్ ని “యంగ్ టైగర్” అంటాము కదా! అలా అన్నమాట.”
“ఓహ్! ఓకే!” అర్థమయినట్టు తలూపాడు కార్తీక్.
“ఆయన అంత గొప్పవాడు కావడానికి కారకుడు మహామంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని “అప్పాజీ” అని పిలిచేవారట. ఆయన కొలువులో “అష్టదిగ్గజాలని” ఎనిమిది మంది కవులు వుండేవారట. ఆ కవులతో “భువనవిజయం” ఏర్పాటు చేశాడట.”
“కవులంటే? “అడిగాడు కార్తీక్
“కవులంటే.. అదే పద్యాలు వ్రాస్తారు”
“యు మీన్ పొయట్రీ?”
‘అయ్యుండొచ్చు. “నాకు ఇంగ్లీష్ రాదు నీకు తెలుగు రాదు. కానీ భలేగా ఫ్రెండ్స్ అయ్యాము” నవ్వుతూ అన్నాడు గణేష్.
“యా! వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్.’
“ఆ కవుల్లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు” చెప్పాడు గణేష్
‘ఓ! తెనాలి రామలిం. నేను ఆయన కామిక్స్ చదివాను. చాలా ఫన్నీగా వుంటాయి.”
“అందుకే ఆయన్ని వికటకవి అన్నారు. నీకు తెలుసా ఆయన మేక, తోక మీద పద్యం పడాడు.
మేక తోక మేకతోకకు తోక మేక మేకకోకతోక ...........................................................”
“ఓహ్! ఇట్స్ రియల్లీ ఫన్ని. ఇవన్ని మీ టెక్స్ట్ బుక్స్ లో వున్నాయా?” అడిగాడు కార్తీక్
“అన్నీ లేవు. కానీ మా తెలుగు మాస్టారు పుస్తకాల్లో లేనివి కూడా చెప్పేవారు. ఆయన పాఠం చెబుతుంటే ఓ కథ వింటున్నట్టు వుండేది.” బదులిచ్చాడు గణేష్.
“యూ పీపుల్ రియల్లీ లక్కీ. మాకంతా రొటీన్. జస్ట్ ఓ ప్లేయర్లో సిడినో, క్యాసెటో వింటున్నట్టు వుంటుంది.”
అలా సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు. మద్యలో గణేష్ భోజనాన్నే ఇద్దరూ పంచుకొని తిన్నారు.మాటల మద్యలో కార్తీక్
వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకొని తనకి తెలీకుండా వాళ్ళ డాడీకి కార్తీక్ ఎక్కడ ఉన్నది తెలిపాడు.
అలా మాట్లడుకొంటుండగా “కార్తీ!” అంటూ అరుపు వినపడింది.
“డాడీ!” అప్రయత్నంగా పలికాయి కార్తీక్ పెదాలు.
కారు దిగి పరుగున వచ్చి కార్తీక్ ని వాటేసుకున్నారు కార్తీక్ డాడి, డాక్టర్ సుధాకర్, మమ్మి శాంతి.
కాసేపు అలా ఉండి తెరుకున్నాక, “ఎక్కడికెల్లావ్ బస్ దిగి ఇంటికి రాకుండా? నేను మమ్మి ఎంత కంగారు పడ్డామో తెలుసా?” అన్నాడు సుధాకర్.
తలవంచుకున్నాడు కార్తీక్.
“ఏం మాట్లాడవు?” గద్దించాడు వాళ్ళ డాడి.
దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న మల్లయ్య వారి దగ్గరకు వచ్చి, “బాబు భయపడుతున్నాడు. ఇంటికెళ్ళి నెమ్మదిగా అడగండి” అన్నాడు.
సుధాకర్, కార్తీక్ వైపు తిరిగి, “రా! ఇంటికి వెళదాం” అన్నాడు.
“వస్తాను. బట్ ఒన్ కండీషన్. గణేష్ ను కూడా తీసుకెలదామంటేనే!” అన్నాడు కార్తీక్
“నో! “అతనెల మనింట్లో వుంటాడు. అసలికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు”” అంది కార్తీక్ మమ్మి శాంతి.
“అయితే నేను రాను” బెట్టు చేశాడు కార్తీక్.
“అలా అనకూడదు. మమ్మి, డాడి చెప్పినట్టు వినాలి. ఇంటికెళ్ళు అని సముదాయించాడు” గణేష్.
“ప్లీజ్ డాడి! అట్లీస్ట్! డైలీ ఒన్నవరు అన్నా గణేష్ దగ్గరకు పంపిస్తానంటేనే వస్తా!” అన్నాడు కార్తీక్
ఇంక చేసేదేమీలేక “సరే చూద్దాం! పద ఇంటికెళదాము” అన్నారు కార్తీక్ తల్లిదండ్రులు.
“బై గణేష్! వి విల్ బి గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.” గణేష్ కి బై చెప్పాడు కార్తీక్.
కారు ఎక్కబోతు “ఒన్ మోర్ కండిషన్” అని మళ్ళీ ఆగాడు. ఏమిటన్నట్టు చూసారు సుధాకర్ మరియు శాంతి.
“నెక్స్ట్ వీక్ స్కూల్లో ఆన్యువల్ డే వుంది. మీరు వస్తానంటేనే కారెక్కుతా, లేకపోతే ఇక్కడే వుంటా” అన్నాడు కార్తీక్
“తప్పకుండ వస్తాం. ప్రామిస్! సరేనా! ఇక కారెక్కు” అన్నారు. అందరు కారెక్కరు.
వెళుతున్న కారునే చూస్తుండి పోయాడు గణేష్.
చెప్పినట్టుగానే రోజూ సాయంత్రం పూట గణేష్ దగ్గరకు వచ్చి ఓ గంట కబుర్లు చెప్పుకోవడం, ఆడుకోవడం నిత్యకృత్యం అయ్యింది కార్తీక్ కి.
ఆన్యువల్ డే రానే వచ్చింది. ఆడిటోరియం అంతా తల్లిదండ్రులు, పిల్లలతో నిండిపోయింది. ప్రామిస్ చేసారు గనక కార్తీక్ మమ్మి డాడి కూడా వచ్చారు. కార్తీక్ ప్రొద్దున్నే స్కూల్ కి వచ్చాడు. ఏదీ కనపడడే అని కూర్చున్న చోటు నుంచే కళ్ళతో వెతుకుతున్నారు.
సభ ప్రారంభమయ్యింది. ముఖ్యఅతిథిగా విద్యాశాఖామాత్యులు వచ్చారు. అందరి ప్రసంగం అయిన తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పాటలు, డ్యాన్సులు, స్కిట్స్ ఒకటొకటిగా జరిగాయి. చివరిగా ఫ్యాన్సి డ్రెస్ కంపెటీషన్ మొదలైంది. దాంతోపాటే కార్తీక్ తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పటికీ కార్తీక్ జాడ లేదు.
ఇంతలో “లాస్ట్ ఐటెం బై కార్తీక్. హి విల్ పెరఫాం యాస్ “శ్రీకృష్ణదేవరాయ” అని స్పీకర్ లో వినపడింది.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కార్తీక్ తల్లితండ్రులు. వాళ్ళ కళ్ళన్నీ వేదికపై కార్తీక్ కోసం వెదక సాగాయి. అసలు తాము విన్నది నిజమేనా అనిపించింది.
ఇంతలో వేదిక మీద ఒక ప్రక్క నుండి గంభీరంగా నడుచుకొంటూ వచ్చాడు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో వున్న కార్తీక్.
వేదిక మద్యలో వున్న మైకు దగ్గర నుల్చుని మొదలెట్టాడు.
“తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు కొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స”
పద్యానికి తగ్గ హావభావాలతో అభినయిస్తూ ముగించాడు.
ఆడిటోరియం అంతా కళతారధ్వనులతో మారుమ్రోగింది. కార్తీక్ అందరికి తలవంచి నమస్కరిస్తుండగా తెర పడింది.
తమ కళ్ళను తామే నమ్మలేక పోతున్నారు కార్తీక్ తల్లిదండ్రులు.
మంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రధానం మొదలైంది. “ఇన్ ఫాన్సీ డ్రెస్ కాంపెటీషన్ ది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కార్తీక్” “ఏకపాత్రాభినయంలో మొదటి బహుమతి పొందినది కార్తీక్” అని స్పీకర్ లో వినపడింది.
శ్రీకృష్ణదేవరాయల వేషంలో వున్న కార్తీక్ వచ్చి బహుమతి అందుకున్నాడు.
మంత్రి మైక్ తీసుకొని “ “చరిత్రలోని మహానుభావులను, వారి గొప్పతనాన్ని వర్తమానంలో స్మరించుకొంటూ భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి. మన భాష, సంస్కృతీ, సాహిత్యాలను కాపాడుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు జనరంజకమైన పాలన చేస్తూ, తెలుగు భాషా,సాహిత్యాలకు ఎనలేని సేవ చేశాడు. అందుకే ఆయనను “”సాహితి సమరాంగణ సార్వభౌముడు”” అన్నారు. ఆయన పట్టాభిషక్తుడై ఐదువందల సంవత్సరలైన ఈ సందర్భంలో ఆయనను స్పురింప చేస్తూ కార్తీక్ చేసిన అభినయం మెచ్చదగినది. మంచి భాష, సంస్కృతీ నేర్పించి, ప్రోత్సాహించిన గురువులకి, తల్లిదండ్రులకి నా అభినందనలు. దయచేసి వారిని వేదిక పైకి రావలసిందిగా కోరుతున్నాను” అంటూ ఆహ్వానించారు.
కార్తీక్ తల్లిదండ్రులు వేదిక మీదకు రాగానే ఆడిటోరియం అంతా మరొక్కసారి కళతారధ్వనులతో మారు మ్రోగింది. ఇద్దరు ఒక్కసారిగా తమ బిడ్డను హృదయానికి హత్తుకొన్నారు.
కారులో ఇంటికి వెళుతుండగా దారి పొడువునా ఒకటే పొగుడుతున్నారు కార్తీక్ ని వాళ్ళ తల్లిదండ్రులు.
“మామ్మి, డాడి, “ఇందులో నాదేమి లేదు. అంతా గణేష్ గొప్ప. ఎందుకంటే ఒక వారం రోజుల ముందు వరకు నాకు శ్రీకృష్ణదేవరాయలంటే ఎవరో తెలీదు. స్కూల్లో చెప్పలేదు. మీరు కూడా చెప్పలేదు. మీకంత టైం కూడా లేదు. మన హిస్టరీ గురించి, మన కల్చర్ గురించి మనమే తెలుసుకోలేకపోతే ఎలా? గణేష్ వలన నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈ ప్రైజ్ గణేష్ ది. అతడికే చెందాలి” అని టాంక్ బండ్ మీదుగా వెళుతున్న కారు అద్దాల్లోంచి తెలుగు వెలుగులను చూస్తూ చెప్పాడు కార్తీక్.
-------------------------------------------------- సమాప్తం------------------------------------------------------------------------------------------------
చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి – ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు – నిదురపోతుండాది
జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! || చేయెత్తి ||
వీర రక్తపుధార – వారబోసిన సీమ
పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవొడూ! || చేయెత్తి ||
కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనెతలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా! || చేయెత్తి ||
నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం
భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు!
శిల్పినని చాటావు దేశదేశాలలో! || చేయెత్తి ||
దేశమంటే మట్టి కాదన్నాడు
మునుషులన్న మాట మరువబోకన్నాడు
అమర కవి గురజాడ నీవాడురా!
ప్రజల కవితను చాటి చూపాడురా! || చేయెత్తి ||
రాయలేలిన సీమ – రతనాల సీమరా
దాయగట్టె పరులు – దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా!
వారసుడ నీవెరా తెలుగోడా! || చేయెత్తి ||
కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదవలేదన్నా! || చేయెత్తి ||
ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా! || చేయెత్తి ||
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా – మొనగాడా! || చేయెత్తి ||
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి – ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు – నిదురపోతుండాది
జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! || చేయెత్తి ||
వీర రక్తపుధార – వారబోసిన సీమ
పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవొడూ! || చేయెత్తి ||
కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనెతలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా! || చేయెత్తి ||
నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం
భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు!
శిల్పినని చాటావు దేశదేశాలలో! || చేయెత్తి ||
దేశమంటే మట్టి కాదన్నాడు
మునుషులన్న మాట మరువబోకన్నాడు
అమర కవి గురజాడ నీవాడురా!
ప్రజల కవితను చాటి చూపాడురా! || చేయెత్తి ||
రాయలేలిన సీమ – రతనాల సీమరా
దాయగట్టె పరులు – దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా!
వారసుడ నీవెరా తెలుగోడా! || చేయెత్తి ||
కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదవలేదన్నా! || చేయెత్తి ||
ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా! || చేయెత్తి ||
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా – మొనగాడా! || చేయెత్తి ||
తెలుగువాడినని గర్వించు! తెలుగును బ్రతికించు!
Good Story
ReplyDeleteధన్యవాదాలు.
ReplyDeleteబహుమతి గెలుచుకున్నందుకు అభినందనలండీ..
ReplyDeleteధన్యవాదాలు మధురవాణి గారు.
ReplyDeleteచాల చక్కగా రాసారు..బాగుంది
ReplyDeleteధన్యవాదాలు శేఖర్ గారు!
DeleteBest Wishes,
Suresh Peddarju
తిండి దొరకని , తిన్నదరగని మనుషుల మధ్య పసిమనసు ల స్నేహానికి కారణమైన చరిత ను మరిస్తే భవిత లేదని చక్కగా చెప్పారు. మనస్తత్వాలను బాగా చదివినట్లున్నారు సురేష్ గారూ ! కథ బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు కొండల రావు గారు!
DeleteBest Wishes,
Suresh Peddarju
ఆయనకు మనవాళ్ళు ఇచ్చిన బిరుదు “ఆంధ్రభోజుడు”
Delete“బిరుదంటే?” అడిగాడు కార్తీక్.
“బిరుదంటే.......ఆ ఇప్పుడు మనం చిరంజీవిని “మెగాస్టార్” అని, జూ.ఎన్.టి.ఆర్ ని “యంగ్ టైగర్” అంటాము కదా! అలా అన్నమాట.”
keka
Thanks a lot Raja.
DeleteBest Wishes,
Suresh Peddaraju