Wednesday, 15 August 2012

మార్పు కోసం!

భాగ్యనగరం నుండి దాదాపు నలబై కిలోమీటర్లు దాటిన తరువాత ప్రదాన రహదారి నుండి ఇంకో ఐదు కిలోమీటర్లు లోపలికి వెళితే వస్తుందా వూరు. పల్లె వెలుగు బస్సు లోంచి దిగాడు రమణ. అతను ఒక పత్రికా విలేఖరి. ఉపాది హామీ పథకం పనులు జరుగుతున్నాయని తెలిసి అవి అమలు అయ్యే తీరును పరిశీలించి రిపోర్టు తయారు చేయడానికి వచ్చాడు. జర్నలిజం మీద వున్న మక్కువతో అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మూడేళ్ల కిందట తన కెరీర్ ప్రారంభించాడు. చాలా నిబద్ధతతో పనిచేస్తాడు. సమాజంలో మార్పు తీసుకురాగలిగేది, సమాజపు రూపు రేఖల్ని మార్చ గలిగేది మీడియానేన్నది అతని గట్టి నమ్మకం. 

బస్సు దిగి పది నిమిషాలలో పనులు జరుగుతున్న చోటికి చేరుకున్నాడు రమణ. అది చెరువులో పూడిక తీసే పనులు. దూరంగా నిలుచుండి గమనిస్తున్నాడు రమణ.  మద్య మధ్యలో తన కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. అక్కడ పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి.  ఈరోజు కూలీలకు తాము చేసిన పనిదినాలకు వేతనం ఇచ్చే రోజు.  కూలీలలో ఎక్కువగా స్త్రీలే వున్నారు. మగ కూలీల్లో కొందరు తెగ హడావుడి పడుతుండడం చూశాడు. ఈలోపు పనులు పూర్తిగా ముగిశాయి. 

వేతనం కోసం అందరూ వరస క్రమంలో నిలబడ్డారు. ఇందాక తను చూసిన మగ కూలీలు తోసుకుంటూ వచ్చి అందరి ముందూ నిలబడ్డారు. ఎందుకు వీళ్ళకీ తొందర! ఇవేమైన సినిమా టికెట్లా అయిపోవడానికి! అనుకున్నాడు రమణ. ఇంతలో అధికారులు వచ్చి డబ్బు పంపిణీ చేయడం మొదలెట్టారు. 

ఇందాక హడావుడి చేసినవాళ్ళు వేతనం తీసుకుని పోతూవుంటే, “పైసల్ చేతిలో పడ్డాయి. గింక గా మందు దుకాణామ్కెల్లి షురూ చేస్తారు బద్మాష్ గాళ్ళు” అంటూ వెనక నిలబడ్డ స్త్రీలు తిట్టడం రమణకి వినబడింది. 

ఏంటి వీళ్ళు వారం రోజులు కష్టపడి సంపాదించిన కూలి డబ్బులతో ఇంటికి కావలిసినవి కొనుక్కోకుండానే మద్యం షాపుకు వెళతారా! మరి వీళ్ళు తెచ్చే కూలి కోసం ఇంట్లో ఎదురు చూసే వీళ్ళ పెళ్ళాం బిడ్డలు సంగతేంటి! వీళ్ళకి గుర్తుకురారా! ఆశ్చర్యం అనిపించింది రమణకి. సరే! ముందు వచ్చిన పని అవ్వనీ తరువాత చూద్దాం అనుకున్నాడు. 

అరగంటలో అందరికీ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు అధికారులు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనను పరిచయం చేసికొని, ఇంటర్వూ చేస్తూ ఆ పథకం అమలు అవుతున్న తీరు తెన్నులు, వారి కొచ్చే ఇబ్బందులు, సాధకబాధకాలు తెలుసుకున్నాడు. ఇక ముగిస్తూ, ఇందాక ఆడ కూలీలు మాట్లాడుకుంటున్నవి, తనకు వచ్చిన సందేహాలను అధికారుల ముందు వ్యక్తపరిచాడు రమణ.  

“చూడండి! వున్న వూరిలో పనులు లేక పట్టణాలకు వెళ్ళే గ్రామీణ కూలీల వలసలను తగ్గించడానికి, ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించాలన్న సదుద్దేశంతో భారత ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టింది. దాన్ని సక్రమంగా అమలు చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తున్నాము. దానిలో భాగంగానే వేతన పంపిణీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. కూలీ డబ్బులు ముట్టాక వాటిని ఎలా ఖర్చు పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. దాని మీద మా అజమాయిషీ వుండదు అంటూ సమాధానం ఇచ్చాడు అధికారి.

అధికారి చెప్పింది కొంతవరకు సబబుగానే అనిపించింది రమణకి. అధికారులకు ధన్యవాదాలు తెలిపి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు.  అలా నడుచుకుంటూ వెళుతుండగా మద్యం అమ్మే బెల్టుషాప్, దాని ముందు కూర్చొని తాగుతున్న ఇందాకటి కూలీలు కనపడ్డారు అతనికి. అప్పటికే మత్తు ఎక్కినట్టుంది. కాస్త తూలుతున్నారు. ఆ దృశ్యాన్ని కెమేరాలో బంధించాడు. 

వాళ్ళ దగ్గరికి వెళ్ళి, “ఇప్పుడే కదయ్యా కూలీ డబ్బులు తీసుకున్నారు. అప్పుడే మొదలెట్టారు. ఇంటికి కావలిసినవి కొని తీసుకెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా!”

“ఏయ్! నువ్వెవడివి మమ్మల్లడగడానికి. నీ పని చూసుకో పో!” అన్నాడొకడు. 

దూరం నుంచి గమనిస్తున్న ఓ వ్యక్తీ రమణ దగ్గరకు వచ్చి, “సార్! వదిలేయండి. వీళ్ళను మార్చడానికి రెండేళ్లగా ప్రయత్నిస్తున్నాను. కానీ వీళ్ళు మారరు” అన్నాడు

ఆ వ్యక్తిని చూస్తూ, “ఇంతకూ మీరెవరు?” ప్రశ్నించాడు రమణ.

“నేనొక సామాజిక కార్యకర్తను. నా పేరు సూర్య!” అంటూ పరిచయం చేసుకున్నాడు.

చేయ్యందిస్తూ, “ముఖంపైన ఆ రక్తమేంటి?” అడిగాడు రమణ

“రండి! ఆ టీ షాపు దగ్గరకెళ్ళి మాట్లాడుకుందాం” అని రోడ్డు దాటుతూ “ఇవన్నీ మామూలే సార్! ఈ రోజు కూలీ డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి వీళ్ళను ఇక్కడకు రాకుండా ఆపడానికి ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.”

“దారుణం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది”

“వాళ్లైన ఏమి చేస్తారు. ఇంకా అడ్డుకున్నందుకు నన్నే లోపలేస్తారు. అసలు ప్రభుత్వ నియంత్రణ వుంటే ఇలా వుంటుందా! సీలు వేసిన బాటిల్‌అమ్మాలి. కానీ అలా అమ్మట్లేదు. సీలు తీసి తక్కువ రకం మద్యాన్ని కలిపి లూజుగా అమ్ముతున్నారు. ఇక మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి రోజుకో రేటును నిర్ణయిస్తూ ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్ముతున్నారు. ప్రభుత్వమే చూసీచూడనట్లు వుంటోంది. ఇక నాలాంటి వారి గురించి పట్టించుకుంటారా!”  అని నిట్టూర్చాడు సూర్య.

“ఎక్సైజ్ వాళ్ళు ఏమిచేస్తున్నారు?”

“తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మాత్రం దాడులు నిర్వహిస్తుంటారు. వాళ్ళ టార్గెట్లు వాళ్ళకుంటాయి. అవి పూర్తిచేయడానికి ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దాన్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత చిన్న వూరిలో నాలుగు బెల్టుషాపులు వున్నాయంటే నమ్ముతారా! వూళ్ళల్లో తాగడానికి నీళ్ళు దొరక్కపోయినా మందు మాత్రం ఇరవై నాలుగు గంటలూ దొరుకుతుంది.”

కాసేపు ఆలోచించిన తరువాత “మరి వచ్చిన కూలీ డబ్బునంతా ఇక్కడే తగలేస్తున్నారు. ఇంకేమి తింటారు?” తిరిగి అడిగాడు రమణ

సూర్య నవ్వుతూ, “భలేవారే! ఆ విషయంలో కొంత తెలివిగా వుంటారు. ప్రభుత్వం ఇచ్చే రెండు రూపాయల కిలో బియ్యం కొనడానికి సరిపడా వుంచుకుంటారు. అది కూడా చేయకపోతే వీళ్ళ పెళ్ళాళ్ళు వీరిని ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వరు” అన్నాడు.

“తాగి జేబులకు చిల్లుతో పాటు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారన్నమాట.”

“నయం చేసుకోవడానికి ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ వుందిగా. ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతోంది. నిజంగా ఈ బెల్టుషాపులతో పల్లెప్రజల బతుకులు చిద్రమవుతున్నాయి” 

“మరి ఎలా! ఇదంతా వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, తమ బతుకుల్ని ఎప్పటికి సరిదిద్దుకుంటారు!” 

“వదిలేయండి సార్! ఇదంతా మానలాంటి వాళ్ళ ఆవేదనే తప్ప ఎవరికీ పట్టదు. వీళ్ళకి ఆ దేవుడే దిక్కు. వుంటాను సార్! పక్క వూళ్ళో జాతర జరుగుతోంది. వెళ్ళాలి!” అంటూ కదలబోయాడు.

“నేనూ మీతో వస్తానుండండి” అంటూ అతన్ని అనుసరించాడు రమణ. కాసేపు బస్సుకోసం వేచి చూశారు ఇద్దరూ. ఎంతకీ రాకపోయేసరికి రెండు కిలోమీటర్లే కదా నడుద్దాం అనుకొని మాట్లాడుకుంటూ నడవసాగారు.

సూర్య మాట్లాడుతూ “ ప్రతి రాజకీయ నాయకుడు మా పార్టీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తాం అంటూ వాగ్దానాలు చేస్తారు. తీరా వచ్చాక ఆ వూసే ఎత్తరు.  ఎప్పుడైనా మీలాంటి వారు ప్రశ్నిస్తే, జనాలని తాగకుండా చెయ్యలేక పోతున్నాం అంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తూ, తాము చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ఇష్టానుసారంగా అమ్మకాల లైసెన్సులు ఇస్తున్నారు. తిరిగి ఆ లైసెన్సులను బినామీ పేర్లతో ప్రజా ప్రతినిధులే పోటీలుపడి దక్కించుకోవడం సిగ్గుపడాల్సిన విషయం ”

“అవునవును మద్యం టెండర్ల ద్వారా వేలకోట్ల రూపాయలు పొందుతోంది ప్రభుత్వం.”

“మరి అంత డబ్బు పెట్టి లైసెన్సు పొందిన వాడు వూరుకుంటాడా, అసలుతో పాటు లాభం రావడానికి వాడి లెక్కలు వాడికుంటాయి.”

“మన రాష్ట్రంలో బెల్టుషాపులు లక్షన్నర పైగా వున్నాయని ఈ మద్య జరిపిన సర్వేలో తేలింది” అన్నాడు రమణ.

“వుంటాయండి ఎందుకుండవు, పల్లెల్లో బడి, దవాఖానా వున్నా లేకపోయినా బెల్టుషాపు మాత్రం ఖచ్చితంగా వుంటోందిప్పుడు. ఈ షాపుల వల్ల, అందులో అమ్మే మద్యం వల్ల బలవుతోంది మాత్రం పాపం ఆడవాళ్ళే!”

“మద్యపానాన్ని పూర్తిగా నిషేదించలేకపోయినా కనీసం కట్టడి చేస్తే పరిస్థితి మెరుగావుతుంది కదా”

“అవుతుంది. కానీ కట్టడి చేసేది ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.  మద్యాన్ని ఆదాయవనరుగా భావించే ప్రభుత్వాలు అసలు అందుకు పూనుకుంటాయా?”

అలా మాట్లాడుకుంటూ వారు జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కల్తీ సారా విచ్చలవిడిగా దొరకడం గమనించాడు రమణ. ఇక అక్కడ ఎక్కువసేపు వుండలేక తనకు కావలిసిన సమాచారాన్ని తీసుకొని బయలుదేరాడు.

“సరే, మళ్ళీ కలుద్దాం! మీతో నాకు పనిపడొచ్చు” అంటూ సూర్య నుండి ఫోన్ నెంబర్ తో పాటు సెలవు తీసుకున్నాడు రమణ. తరువాత తను కూడా ఓ షేర్ ఆటోలో ప్రధాన రహదారిపైకి చేరుకొని బస్సు కోసం చూస్తుండిపోయాడు. సాయంసంధ్య అయ్యింది. తొందరగా ఇంటికి చేరుకోవాలని మనసులో తలచాడు.

ఇంతలో ముగ్గురు యువకులు మోటర్ బైక్ పై వచ్చారు. వాళ్ళ మాటలు, భుజానికున్న బ్యాగులను బట్టి అక్కడే దగ్గరలో వున్న ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులని గుర్తించాడు రమణ.  వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది అతనికి. ఇక వారినే గమనిస్తూ, వారి మాటలను వినసాగాడు.

“రేయ్ క్రిష్! ఎంతసేపు బస్సుకోసం వెయిట్ చేస్తావు రా! ముగ్గరం బైక్ పైన వెళ్దాం! బెట్టు చెయ్యకురా!” అన్నాడొకడు.

“నేను మీతో రాను రా!  బస్సులోనే వస్తా. వద్దని చెప్తున్నా హాట్ తాగారు. ఇప్పుడు త్రిబుల్ రైడింగ్. నాకేమో నైట్ డ్రైవింగ్ చేయడం కష్టం. లేకపోతె నేనే నడిపించేవాణ్ణి.”

“ఏమీ కాదురా! చూడు నేనెంత స్టడీగా వున్నానో!” అన్నాడు డ్రైవింగ్ సీట్లో వున్నవాడు.

“ఔను రాక్ స్టడి! అందుకే ఇందాక షాపు నుంచి వచ్చే దారిలో పడేశావు. అది చూసే నేను రానంటుంది. మీకూ చెప్తున్నా, అనవసరమైన రిస్క్ చెయ్యక బైక్ కాలేజీలో పార్క్ చేసి రండి. ముగ్గరం కలసి బస్సులో వెళ్దాం” అన్నాడు క్రిష్

“రేయ్! రేపు సండే. బైకుతో పనుంది. అందుకే దీనిపై వెళ్దామంటున్నా” 

“సరే! అందుకే మీరు వెళ్ళండంటున్నా కదా! నేను మాత్రం బస్సులోనే వస్తా!”

వింటున్నరమణకి మతి పోయింది. ఇద్దరేమో తాగున్నారు. తాగని వాడిని తమతో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఆ క్రిష్ అనే వాడు చెప్పే మాటను మిగతా ఇద్దరు వినవచ్చు కదా! అని అనుకున్నాడు. కాలేజీలకి దగ్గరగా ఈ బెల్టు షాపులు వుండడం మూలాన ఇలాంటి వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. మొదట్లో సరదాగా మొదలెడతారు. తర్వాత అది అలవాటుగా మారుతుంది. 

రమణ అలా ఆలోచిస్తూ వుండగా ఇంతలో ముగ్గరిలో మూడవ వాడు క్రిష్ వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం ఎత్తుకుని బైక్ మీద పడేసి, “పదరా గిరి వీడు మంచిగ చెప్తే వినడు” అన్నాడు. రయ్యిమని బైకుని ముందుకురికించాడు గిరి.

“రేయ్! వద్దురా!  ఆపండిరా ప్లీజ్!” అని క్రిష్ అరుస్తుండగా రమణ ఆలోచనల నుండి తేరుకున్నాడు.  

వెంటనే “ఏయ్! వదిలేయండిరా వాడిని” అంటూ అరిచాడు రమణ. కానీ అప్పటికే బైక్ చాలా దూరం వెళ్లి పోయింది. ఇందాక వాడిని బలవంత పెట్టేటప్పుడే వారించాల్సింది. ఏంటీ కుర్రాళ్ళు! తాగి డ్రైవ్ చేస్తూ తమ జీవితాలని పణంగా పెట్టడడమే కాక ఇంకొకరి జీవితాన్ని కూడా రిస్క్ చేయడం. అసలు భయమే లేదా! అనుకున్నాడు.  ఈ లోపు బస్సు రావడం ఎక్కి కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి తనకి. 

శ్రీశ్రీ గారు అన్నది గుర్తొచ్చింది అతనికి. 'కొంత మంది యువకులు ముందు యుగం దూతలు. పావన, నవజీవన బృందావన నిర్మాతలు…' అన్నారు శ్రీశ్రీ.  

కానీ ఇందాకటి ఆ తాగిన కుర్రాళ్ళని చూస్తే ‘కొంత మంది యువకులు మందు తాగుబోతులు అనిపిస్తుంది.' అలాంటి బాద్యత లేని వారితో నవ భారత నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకున్నాడు.

రమణ సిటి బస్సు దిగి తన కాలనీ వైపు వెళుతున్నాడు. కాలనీ మొదట్లో అలజడిగా వుంది. అది వైన్ షాప్. దాని ముందు మందు కోసం ఎగబడుతున్నారు జనం.  ప్రతి వారాంతం ఇలాగే వుంటుంది. మళ్ళీ తనకి శ్రీశ్రీ కవిత్వం గుర్తొచ్చింది. 

‘మరోప్రపంచం మరోప్రపంచం మరోప్రపంచం పిలిచింది. పదండి ముందుకు. పదండి తోసుకు. పదండి పోదాం పైపైకి’’- అంటూ విప్లవ శంఖం పూరించాడు మహాకవి శ్రీశ్రీ.

కానీ ఈ దృశ్యం చూస్తూంటే  ‘మత్తు ప్రపంచం పిలిచింది. పదండి మందుకు, పదండి బీరుకు, పదండి విస్కీకి’ అని తొందరగా తమకు కావల్సినది కొనుక్కొని అంతే తొందరగా నిషాలోకి జారిపోదామనుకుంటున్నట్టు అనిపించింది రమణకి.

చాలా మంది అక్కడే ఫుట్పాత్పై కూర్చొని తాగి బాటిళ్ళను రోడ్లపై చెల్లాచెదురుగా పడేస్తుంటారు. ఇక పీకలదాకా తాగిన మందుబాబులు రోడ్లకు అడ్డుగా తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించడమే కాకుండా అక్కడి ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు కూడా. ఒకట్రెండుసార్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు రమణ. పోలీసులు రావడమేమో వస్తారు. రాగానే కాస్త హడావుడి చేసి వెళ్తుంటారు. మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే!

తన ఇంటికి చేరువవుతుండగా వాళ్ళింటి పక్క పోర్షన్లో వుండే యాదవ్ ఎదురయ్యాడు. హాయ్ అంటూ పలకరించాడు. తను కూడా పలకరిస్తున్నట్టు చెయ్యి వూపాడు. యాదవ్ వెళ్తోంది మందు షాపుకేనని గ్రహించాడు రమణ.

కాలింగ్ బెల్ నొక్కగానే రమణ భార్య పద్మ వచ్చి తలుపు తీసింది. లోపలికి అడుగు పెట్టగానే “బాబూ పడుకున్నడా" అని తన రెండేళ్ళ కొడుకు గురించి  అడిగాడు.

"ఆ! మీ గురించి చూసి చూసి ఇందాకే పడుకున్నాడు.” అన్నదామె.

రమణ స్నానం చేసి రాగానే భోజనం వడ్డించింది. భోజనం ముగించి  టీవీ చూడసాగాడు.  ఓ ఛానల్లో ప్రతిపక్షానికి చెందిన ఓ రాజకీయనాయకుడు తన అనుచరులతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు నిరసనగా ధర్నా చేస్తుండడం చూపిస్తున్నారు. ఇంకో ఛానల్లో అదే రాజకీనాయకుడు జరుగుతున్న ధర్నాకు జనాలను ఎలా పోగేసింది, వారికి మందు బాటిళ్లని ఎలా పంచింది చూపిస్తున్నారు. టక్కున టీవీ ఆపేసి రిమోట్ పక్కన పడేశాడు. ఒకరేమో ధర్నా ఎంత జయప్రదంగా జరిగింది చూపిస్తుంటే ఇంకొకరేమో జనాలను ఎలా ప్రలోభ పెట్టి విజయవంతం చేసుకున్నది చూపిస్తున్నారు. చూసేవాళ్ళు దేన్ని నమ్మాలి.  ప్రజలు అయోమయానికి గురవుతుంటే దాన్ని ఆసరాగా తీస్కొని  తమ పబ్బం గడుపుకుంటున్నాయి రాజకీయపార్టీలు. జనాలు ఈ వాస్తవం గమనిస్తున్నారా అసలు అని ఆలోచించసాగాడు.

ఇంతలో పక్క పోర్షన్లోంచి అరుపులు వినపడ్డాయి. ఇక మొదలెట్టాడు యాదవ్ అనుకున్నాడు రమణ. వారంలో కనీసం రెండుసార్లయిన ఈ సీన్ వుంటుంది. తాగడం భార్యతో గొడవ పెట్టుకోవడం యాదవుకు అలవాటుగా మారింది. ఎంత వినకూడదనుకున్నా తప్పట్లేదు. 

“ఏమే! చికెన్ తెచ్చి వండమని పొద్దున నీకు పైసలు ఇస్తిని కదా! ఎందుకు వండలేదే” అంటూ గట్టిగా కొట్టినట్టు వినపడింది.

“అది కాదండి! పాపకు పొద్దుటి నుంచి జ్వరంగా వుంటే డాక్టరుకు చూపించి మందులు తెచ్చాను. అందుకే పైసలు అయిపోయాయి. ఈ పూటకి ఈ గుడ్డుతో సరిపెట్టుకోండి” అంది యాదవ్ భార్య

“గా ముక్క నేను దుకాణమ్కి వెళ్ళక ముందు చెప్పాలే. మందు కొట్టినాక గింక యాదుండదూలె అని అనుకొన్నావులే. నా కెరుకనే నీ దొంగ జిత్తులు” అని మళ్ళీ కొట్టసాగాడు. 

అమ్మా! చంపేస్తున్నాడు అంటూ దెబ్బలకు తట్టుకోలేక అరవసాగింది యాదవ్ భార్య.

నిజంగా చంపేటట్టు వున్నాడని వెళ్లి “ఏయ్ యాదవ్! తలుపు తెరువ్” అంటూ వాళ్ళింటి తలుపు బాదాడు రమణ. రెండు నిమిషాల తరువాత తలుపులు తెరచుకున్నాయి. యాదవ్ బయటకు వచ్చి అడిగేలోపే ఏమీ ఎరుగని వాడిలా చక చక వెళ్ళిపోయాడు. పద్మ లోనికి వెళ్లి యాదవ్ భార్యను సముదాయించింది. అక్కడే కాసేపుండి తిరిగి వచ్చేసారు ఇద్దరూ. ఇలా ఈ మధ్యన తరుచుగా జరుగుతోంది.

రమణ పడుకొని ఆలోచిస్తున్నాడు. సాయంత్రం నుండి జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. యాదృచ్చికంగా అన్నీ మద్యంకు సంబందినవి కావడం ఆశ్చర్యం వేసిందతనికి. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ ఆ రోజు దినపత్రిక తిరగేస్తున్నాడు రమణ. “జాతరలో నకిలీ మద్యం” అన్న హెడ్డింగ్ అతని కంట పడింది.  వార్తను పూర్తిగా చదివాడు. అరే! జాతర జరిగిన వూరు నిన్న తను వెళ్ళిన వూరేనని గ్రహించాడు. నకిలీ మద్యం తాగి పాతికమంది దాక ఆస్పత్రి పాలయ్యారు అని వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుందని రాశారు. తాగిన వాళ్ళల్లో చాలా మంది కూలీలే అని వ్రాసుంది. మనసంతా బాధగా అనిపించింది రమణకి.

కాసేపయ్యాక టీవీ ఆన్ చేశాడు. ఓ ఛానల్లో తాగి మోటర్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన విద్యార్థులు. వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించిన స్థానికులు అని స్క్రోలవుతోంది. మీడియాలోని స్నేహితుల ద్వారా వాకబు చేయగా ఆ విద్యార్థులు నిన్న సాయంత్రం తను చూసిన వారేనని తెలిసింది. వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటే మరింత బాధ అనిపించింది అతనికి.  ఇంతలో ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టనిపించి వెళ్ళి తీసాడు. 

ఎదుట కంగారుగా యాదవ్. 

“సార్ మా ఆవిడ మీ ఇంటికి వచ్చిందా!” అడిగాడు యాదవ్.

“లేదే! రాలేదు” అంటూ ఏమైందని ప్రశ్నించాడు రమణ.

“అయ్యో! ఇంటికి ఇప్పుడే వచ్చి చూస్తే లేదు. పాప కూడా కనిపించట్లేదు. నాకు భయమేస్తోంది సార్!  ఏమి చేయాలో తెల్వట్లేదు” అంటూ ఏడుపు మొఖం పెట్టాడు.

“రాత్రి తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాదావ్. మనిషిలా ప్రవర్తించావా నీవసలు! చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి చేయాలో తెలియటం లేదు అంటున్నావు” కోపంతో అరిచాడు రమణ.

“తప్పయింది సార్. మీరు పేపరోళ్ళు కదా! మీకు పోలీసులతో దోస్తు వుంటది. వాళ్లకి చెప్పి ఏదన్న చెయ్యండి సార్!” వేడుకున్నాడు యాదవ్

కోపాన్ని అణుచుకుంటూ “సరే! ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అని నీవు కూడా నీ బంధువుల ఇల్లకేమైన వెళ్ళిందేమో కనుక్కో అన్నాడు.”

అలా రెండు గంటలు వెతగ్గా యాదవ్ భార్య తనకు పిన్ని వరసయ్యే వాళ్ళింట్లో వుందని తెలుసుకున్నాడు. యాదవ్ తన భార్యను బ్రతిమాలి, బామాలి ఇంకోసారి చెయ్యను అని కట్ట మైసమ్మ మీద ఒట్టేసి ఇంటికి తెచ్చుకున్నాడు. 

ఆమె ఎలాంటి అఘాయిత్యం చేసుకోనందుకు వూపిరి పీల్చుకున్నారు రమణ దంపతులు.

నిన్న జరిగిన సంఘటనలకు పర్యవసానాలు ఈ రోజు కనిపించాయి రమణకి. వీటన్నింటికి బాద్యులు ఎవరు? పభుత్వమా! రాజకీయనాయకులా! ప్రజలా! వ్యవస్థనా! ఎంత ఆలోచించినా జవాబు దొరకట్లేదు అతనికి. ఇంతలో టీవీలో వచ్చే పాట అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది.

"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిమారదు లోకం మారదు కాలం 
దేవుడు దిగి రాని , ఎవ్వరు ఏమైపోనీ ... మారదు లోకం మారదు కాలం"  ఇలా సాగుతోంది పాట.....


పాటలోని కవి మాటలు రెచ్చగొట్టాయి రమణని. లేదు మారాలి. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి? ఆలోచించసాగాడు. చివరికి అతని ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వ దృక్పథం మారాలి. రాజకీయనాయకుల తీరు మారాలి. ప్రజల ఆలోచనలు మారాలి. మొత్తంగా ఈ వ్యవస్థలోనే మార్పు రావాలి అనుకుంటూ, పెన్నూ, పేపర్ తీసుకున్నాడు. రాయడం మొదలు పెట్టాడు. మద్యం-బెల్టుషాపులు, వాటికి ఆకర్షితులవుతున్న జనం, ఆదాయం పెంచుకోవడానికి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, బుగ్గిపాలవుతున్న బతుకులు. 

ఎలా నియంత్రించాలి, ప్రజల్ని ఎలా చైతన్య పరచాలి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఎలా సమకూర్చుకోవాలి అంటూ దానికి ఉదాహరణగా అపార ఖనిజ సంపాదకు నిలయమైన మన రాష్ట్రం, వాటిని తవ్వుకోవడాన్ని ప్రయివేట్ వ్యక్తులకు లీజు కిచ్చి వారిని కోటీశ్వరులను చేయడం కన్నా ప్రభుత్వమే తవ్వి అమ్మగా వచ్చిన సొమ్ముతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యచ్చో చెబుతూ మొత్తం పది పేజీల వ్యాసాన్ని ఆ అర్థరాత్రికి  తయారుచేశాడు. దానికి ‘మార్పు కోసం’’ అన్న టైటిల్ పెట్టాడు. దీన్ని తన పత్రిక సబ్-ఎడిటర్ తో ఓకే చేయించి పత్రికలో వచ్చేట్టు చేయాలనుకుంటూ నిద్రకుపక్రమించాడు. 

మరుసటి రోజు రాసిన దాన్ని సబ్-ఎడిటర్ టేబుల్ ముందుంచాడు రమణ. 

దాన్ని చూడగానే తిరస్కారంగా పక్కన పడేస్తూ, “నీకు ఇచ్చిన పనేంటి! నీవు తెచ్చినదేంటి!” అన్నాడు

“సార్! అది కూడా తయారుచేశాను. ఇది దాని కంటే ముఖ్యమైనది. ముందు దీన్ని ప్రచురిస్తే రెస్పాన్స్ బాగుంటుంది” అని ఒప్పించ ప్రయత్నం చేశాడు. 

“అన్నీ నువ్వే చెప్పి, నువ్వే డిసైడ్ చేస్తే ఇక నేనెందుకు! రెండూ అక్కడ పెట్టేసి వెళ్ళు” అన్నాడు సబ్-ఎడిటర్.

సాయంత్రం వరకు వేచి చూశాడు సబ్-ఎడిటర్ పిలుస్తాడేమోనని! అదేమీ కనిపించకపోవడంతో తనే వెళ్ళాడు.

ఇది అవసరం లేదని తను మాద్యంపై వ్రాసిన దాన్ని తిరిగిస్తూ, “చూడు మనది చిన్న పత్రిక. సర్క్యులేషన్ పెరగాలంటే మనకు ఎప్పుడూ సెన్సేషన్ న్యూస్ కావాలయ్య. ఇలాంటివి ఎవడు చదువుతాడు. దీన్ని తీసుకుని వెళ్ళి మీ అబ్బాయికి ఇచ్చేయ్! కాగితం పడవలు చేసుకుని ఆడుకుంటాడు” అని తన పనిని చేసుకోసాగాడు.

ఇక ఏమి మాట్లాడాలో తెలీయక బయటకు వచ్చాడు రమణ. ఆఫీసులో వుండాలనిపించలేదతనికి. ఇంటికొచ్చేసాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఇక పని చేయాలనిపించలేదతనికి. ఆఫీసుకు వెళ్లడం మానేసాడు. రెండు రోజుల తరువాత తన రాజీనామా పంపించాడు.  

మళ్ళీ ఉగ్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాలా ఇప్పుడు అని తలచాడు. కానీ ఎక్కడకిపోయినా ఇంతేనేమో,  రాజీపడుతూ బ్రతకడం తప్పదా అని మనసులోనే కుమిలాడు. పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి తప్పదు అని ఘోషిస్తోంది అతని అంతరాత్మ. 

అలా నెల రోజులు గడిచాక ఓ రోజు అతని సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి ‘హల్లో’ అన్నాడు. ఫోన్ చేసిన వారు తనని పరిచయం చేసుకుని చెప్పాల్సింది చెప్పేసి పెట్టేశారు. 

“పద్మా గుడ్ న్యూస్!” అంటూ ఇందాక ఫోన్ చేసింది ప్రముఖ దినపత్రిక ఛీఫ్ ఎడిటర్ అని, రేపు వచ్చి కలవమన్నాడని తన భార్యతో చెప్పాడు.

మరుసటి రోజు వెళ్ళి ఛీఫ్ ఎడిటరిని కలిశాడు. “నీవు ఇప్పటివరకు రాసిన వాటిల్లో 'ది బెస్ట్' ఏది?” అని అడిగాడు ఛీఫ్ ఎడిటర్

తనతో పాటు తీసుకొచ్చిన 'మార్పు కోసం' అతనికిచ్చి “దీన్ని ఒకసారి చదవండి సార్!” అన్నాడు రమణ

“సరే! వెయిట్ చెయ్యి. చదివి నా అభిప్రాయం చెప్తా” అన్నాడు ఛీఫ్ ఎడిటర్.

గంట తరువాత రమణని పిలిపించుకుని “చాలా బాగా రాశావు” అని మెచ్చుకొని “నీలాంటి వాడి కోసమే ఎదురుచూస్తున్నాము. నీవు రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించమని ఇప్పుడే పంపిస్తాను. నీవు కోరుకుంటున్న మార్పుకై కలసి పని చేద్దాం. రేపే జాబులో జాయినవ్వు.” అన్నాడు. 

అంధకారంలో వున్న వాడికి దివిటీలా, నాలుగు రోడ్ల కూడలిలో ఎటు వెళ్ళాలో తెలియక నిలుచున్న వాడికి దిక్సూచిలా అగుపించింది రమణకి అతడిచ్చిన ఆ అవకాశం. 

------------------------------------------------------------సమాప్తం---------------------------------------------------------------

51 comments:

  1. బాగుంది. వ్యవస్థలో మార్పు ద్వారానే అన్ని మార్పులూ వస్థాయి. రాజకీయాలనో , నాయకులనో తిట్టడం కాదు. మంచి - చెడూ రెండూ ఉన్నాయి. మంచిని పోగేసి సంఘటితం గా , భావజాల వ్యాప్తి ఉమ్మడిగా ఉద్యమం గా చేయడం తో సమాజం లో మార్పు సాధ్యమే. అయితే అది ఇన్స్టంట్ కాఫీ లా అయితే రాదని గుర్తుంచుకోవాలి. ఆ దిశగానే ఆలోచించేలా , వాస్తవ ఘటనలకు కొంత రచనాధోరణి కలసినా మీ మార్పుకోసం బాగుంది సురేష్ గారూ ! అభినందనలు. ప్రభుత్వాలు ప్రజలను ఓటర్లుగా కాక , పౌరులుగా చూడాలి. అధికారం కోసం కాక నిజమైన శాశ్వతమైన మంచిని చేసే పనులకోసం నాయకులు ప్రయత్నించాలి. అలాంటి నాయకులను అందరూ అభినందించాలి. గుడ్డిగా ఫేషన్ గా తిట్టడం చేయకూడదు.

    ReplyDelete
    Replies
    1. కొండలరావు గారు, నిజంగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించ వచ్చో...ఎలా రూపుమాపుతారో అర్థం అవ్వడం లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ది లేకపోగా, ఇంకా ఎగదోస్తోంది. తాగుడు వల్ల సమాజంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కుటుంబవ్యవస్థ దెబ్బతింటోంది. కానీ ప్రతిఒక్కరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏదైనా జరిగినప్పుడు ఉలిక్కిపడడం మళ్ళీ మరిచిపోవడం జరుగుతోంది. కనీసం మీడియా అయినా చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే పూర్తీగా కాకపోయినా కొంతవరకైనా తగ్గించవచ్చు.

      Delete
    2. కథను మెచ్చుకునందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు కొండలరావు గారు!

      Delete
  2. చాలా బాగా వ్రాశారు సురేష్ గారూ...కథ ముగింపు ఆశాజనకంగా వుంది. సమస్యను సరైన కోణంలో చూడగలిగితే పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది.

    ReplyDelete
    Replies
    1. అవును జ్యోతిర్మయి గారు. ప్రభుత్వం, పౌరులుగా మనం ఈ సమస్య పరిష్కారం ఆలోచించాలి. మీకు కథ నచ్చినందుకు సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!

      Delete
  3. వాస్తవాలు చక్కగా చిత్రీకరించారు.
    నిజంగా ఇది కుటుంభాల పాలిట శాపంగా మారింది.
    మీరు ఇచ్చిన ముగింపు చాలా బాగా నచ్చింది

    ReplyDelete
    Replies
    1. మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం...దానికోసం మనకు చేతనైనది చేద్దాం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు శశి గారు!

      Delete
  4. కథ బాగుంది "మార్పుకోసం" పేరు కూడా కరెక్ట్‌గా సరిపోయింది. కంగ్రాట్స్.. మార్పుకోసం వేచి చూద్దాము. నాక్కూడా ముగింపు నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. కథ నచ్చినందుకు, అభిప్రాయం తెలియజేసినందకు చాలా థాంక్స్ రమణి గారు.

      Delete
  5. చాలా బాగుంది రాజు గారు :)
    Good narration!

    అప్పుడప్పుడు కాకుండా, తరచుగా రాస్తూ వుండండి :)

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ హర్షా...తప్పకుండా మరిన్ని రాయడానికి ప్రయత్నిస్తాను.

      Delete
  6. really very good brother "మార్పుకోసం"
    Don`t Drink And Drive 2 every one
    The life you take may not be your`s own.....

    ReplyDelete
  7. మార్పు రావాలని కోరుకుంటున్న మంచి కథ సర్ మేరు రాసినవి ఎప్పటి కప్పుడు మీ బ్లాగ్ లో పోస్ట్ చేయండి సర్ ఈ పత్రికల వాళ్ళు మంచి కథ కు గుర్తింపు ఎవ్వరు ...

    ReplyDelete
    Replies
    1. మీకు కథ నచ్చినందుకు సంతోషం. తప్పకుండా ప్రయత్నిస్తాను. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు అక్షర కుమార్ గారు!

      Delete
  8. సురేష్ గారూ కథ చాలా బాగుంది, సామాజిక మార్పు కోరుతూ,
    ఓ విషయం గుర్తుంచుకోవాలి, మనం చెప్పేది మంచి అయినప్పుడు అది తప్పకుండా గుర్తింపు పొందుతుంది.
    ఇంత బాగా రాసిన మీరు ఇప్పుడెందుకు రాయరు.
    చాలా బాగా రాసారు. మంచి శైలి, నీతి ఉంది. ఇంకా రాయండి.
    నేను పత్రికల్లో కూడా రాస్తాను కాని అదోగొప్ప కాడు అవకాసం అంతే. మీరు రాయండి. బాగా రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం! ముందుముందు ఇంకా వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు ఫాతిమా రాధ గారు!

      Delete
  9. చాలా బాగా రాసారు సురేష్ గారు

    ReplyDelete
    Replies
    1. మీకు కథ నచ్చినందుకు సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు అనూ రాధ గారు.

      Delete
  10. చాలా బాగా రాశారు.ఈ మధ్య నేను కర్నూలు జిల్లాలోని ఓ పురాతన ఆలయంలో జరిగిన వివాహానికెళ్తే అక్కడ గుడిలోనే పెట్టెలో పెట్టుకుని మందు అమ్ముతున్నారు! నిజంగా దారుణంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి.ఏ ప్రాంతంలో చూసినా మద్యానికి బానిసలవుతున్న యువకులే కనిపిస్తున్నారు!

    ReplyDelete
    Replies
    1. విజయమోహన్ గారు, అవును నిజంగా దారుణంగా వుంది పరిస్థితి. దీనికి పల్లె, పట్టణం, నగరం ఏదీ అతీతం కాదు. దీనికి కుటుంబాలు, యువకులు బలవుతున్నారు. నిజంగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించ వచ్చో...ఎలా రూపుమాపుతారో అర్థం అవ్వడం లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ది లేకపోగా, ఇంకా ఎగదోస్తోంది. కనీసం మీడియా అయినా చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే పూర్తీగా కాకపోయినా కొంతవరకైనా తగ్గించవచ్చు.
      మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు!

      Delete
  11. చాలా బాగుంది. keep writing.

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ రాజా రావ్ గారు...తప్పకుండా ప్రయత్నిస్తాను.

      Delete
  12. ఇంత పెద్ద స్పందన వ్రాస్తునందుకు మన్నించాలి...

    కధ చదువుతున్నంత సేపు... ఏదో బాధ, ఆందోళన , నేనేమీ చెయ్యలేనా అన్న ఆవేదన .... "ఒకే ఒక్కడు" లో అర్జున్ కి ఇచ్చినట్టు నాకు అధికారం ఇస్తే ... మొట్టమొదటి మార్పు, మధ్యం దుకాణాలు మూయించటం చేస్తాను ...రెండొది ఎవ్వరైనా తాగినట్టో, తాగుతున్నట్టో కనపడితే చాలు ఆ మత్తు దిగే వరకు తన్నమనో తోమమనో ఆర్డర్లు జారీ చేస్తాను... తాగుడు మాట వింటే చాలు రక్తం మరిగిపోయేంత ద్వేశం/అసహ్యం పెంచుకున్నాను నేను ఆ "మందు" పట్ల.... తాగుడికి జీవితాలని బలి చేసుకున్న ఎంతో మంది చుట్టాలని/ స్నేహితులని చూసాను కాబట్టి..

    ప్రతీ వైన్ షాపు, దాని ముందు క్యూలు కట్టీ మరీ మధ్యం కొనుక్కునే మనుషులు, తాగిన మైకం తో రోడ్ల మీద పడిపోయేవాళ్ళూ, తాగి వొళ్ళు తెలీకుండా ప్రవర్తించే వాళ్ళూ, ఇలా ఎవ్వరిని చూసినా మనసులో బాధ పడటం తప్పితే నేను ఏమీ చెయ్యలేకపోతున్నానే అని కుమిలిపోతుంటాను ... నా నిస్సహాయ స్తితి పైన జాలి పడుతుంటాను.... అప్పుడప్పుడు ఏడ్చేస్తాను కూడా.

    సంస్కారం నేర్పించే మొదటి గురువులు అమ్మానాన్నలు .... ఎటువంటి మార్పు రావాలన్నా, మొట్టమొదట మెట్టు మన ఇల్లే అన్న మాట గుర్తుపెట్టుకోవాలి.... సమాజం లో అమ్మానాన్నలు ఉన్నారు , స్నేహితులకీ అమ్మానాన్నలున్నారు, రాజకీయ నాయకులకు అమ్మానాన్నలున్నారు , ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులకీ అమ్మానాన్నలున్నారు...... అంటే ఎవరు మారాలన్నా ఏది మారాలన్నా మూలం అమ్మానాన్నలూ , ఇల్లూ .... ఇది నా అభిప్రాయం.

    మీ కధ లో రమణ పాత్ర నా అంతరాత్మే అనుకుంటాను .... . చాలా బాగా వ్రాసారు సురేష్ గారూ..

    ReplyDelete
    Replies
    1. చంద్రకళ గారు, నిజంగా మీరు ఎంత ఆవేదన పడ్డారో ఈ కామెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ సామాజిక సమస్య రూపుమాసిపోవాలని ఆశిద్దాం...దానికోసం మనకు చేతనైనది చేద్దాం. మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు చంద్రకళ గారు!

      Delete
  13. చాలా బాగుంది సురేష్ గారూ!
    చక్కని ముగింపు...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం. అభిప్రాయం తెలియజేసినందకు ధన్యవాదాలు శ్రీ గారు!

      Delete
  14. "నిజాన్ని నిగ్గు తెల్చుటలో సమాజం కోసం పాళీలు ( కవి(యిత్రి) లు) పడే ప్రయాసను..,
    ఔత్సాహికులు ఒకసారి సింహావలోకనం చేసుకుని...,వ్యాపారంగానే కాకుండా వ్యాపకంగా..,
    అవినీతిని ఆరుబయటే అంతం చేసే....,ప్రతీ వ్యక్తి బింభం అందులో ప్రతిబింబించేలా ఉండే...,
    పత్రికను ఆయుధంగా ఎంచుకోవాలి..., అక్షరాలను అస్త్రాలుగా సమాజం ఫైకి సంధించాలి....,
    ఆ అక్షరం నవ సమాజ నిర్మాణంలో ప్రతీ పౌరుడుని పార్దుడివోలె సవ్యసాచులుగా యుద్ధానికి సన్నిద్ధం చేయాలి...,"

    మీరు నమ్మిన.., నిర్ఘంతపోయే నిజం ఏంటంటే 'అక్షరం అమ్ముడుపోతుంది' అయినా సరే ప్రయత్నిద్దాం...,
    అక్షరం అంగడి సరుకు కాకుండా అని..,మన అక్షర ఘోష గాండీవం అని సాటి చెప్పుదాం...,


    నేను కవిని కాకపోయినా మీలాంటి ఎందరో కధకుల కలం స్నేహంలో...,కవిని కావాలన్న కావితార్ధ హృదయంతో నా బలాన్ని,బలహీనతను
    బట్టబయలు చేస్తున్నా......


    మార్పుకోసం మీరు రాసిన ప్రయత్నం చాలా చాలా చాలా బాగుంది.కాని అది ఒక ప్రయత్నంగా మిగిలిపోకుండా....,
    యాగంలా సాగాలని నా ఆకాంక్ష.....
    మీరు సాగించే ఈ మజిలీలో ఒక మైలురాయిలా కాకుండా మీతో
    ఇలానే ఈ కలం స్నేహం కొనసాగాలి.........

    ఇట్లు మీ...,
    రాధాకృష్ణ......

    ReplyDelete
    Replies
    1. అభిప్రాయం చాలా బాగా వెలబుచ్చావు రాధ. నీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం వుంది. ఈ సమస్య రూపుమాపడానికి కేవలం రాతాలకే పరిమితం చేయకుండా మనకు చేతనైన చేతల ద్వారా చూపిద్దాం. అభిప్రాయం తెలియజేసినందుకు థాంక్స్!

      Delete


  15. నేను వాస్తవికంగాను,సినికల్ గా రాస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.మా చిన్నతనంలో కాంగ్రెస్ వాళ్ళు ' కల్లు మానండోయి బాబూ ''అంటూ కల్లుదుకాణాలదగ్గర సత్యాగ్రహం చేస్తూ ఒకోసారి దెబ్బలు కూడా తినే వారు.మనదేశంలోను,ఇంకా ఇతర దేశాల్లోను మద్యపాననిషేధం అమలు చేతకు ప్రయత్నించి విఫలమయారు.ఆత్మనిగ్రహం,మంచి అలవాట్లు తప్ప వేరే మార్గం లేదు.చిన్న వయసు వాళ్ళకి అర్థంకాదు.సంఘసంస్కరణ,moral policing వలన అంతా సాధించవచ్చునని భ్రమపడతారు.

    ReplyDelete
    Replies
    1. అవునండి..ఆత్మానిగ్రహం, మంచి అలవాట్లు వుంటే తప్ప మార్గం లేదు. ప్రస్తుతం అవి నేర్పించే వాళ్ళు ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న. మీరన్నట్టు మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించడం కష్టం. కానీ కట్టడి చేయాలి. పబ్లిగ్గా తాగకుండా, న్యూసెన్స్ చేయకుండా చెయ్యాలి. చెయ్యాలి అంటే మళ్ళీ పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళే పూనుకోవాలి. బెల్టుషాపులు ఎత్తివేయాలి. విచ్చలవిడిగా దొరకడాన్ని అరికట్టాలి. ఇక తాగే వాళ్ళల్లో కూడా భయం బయలుదేరితే క్రమంగా తగ్గుతుంది.

      Delete
  16. అన్ని వర్గాలని టచ్ చేస్తూ చాల చక్కగా ప్రస్తుత పరిస్తితుతులు గురించి చక్కగా రాశారు.
    ఒకడు బాధ తో తాగితే,ఇంకొకడు ఆనందం తో.ఆనందం పొందాలి అంటే తాగటం ఒకటే మార్గం అనుకోవటం.

    నేను బెంగుళూరు వొచ్చిన కొత్తల్లో university దగ్గర అమ్మయిలు,అబ్బాయిలు కలిసి తాగటం చూశాను.ఇది ఒక ఆరు సంవత్సరాల క్రితం.ఇదే సంస్కృతి ఇప్పుడు ఆంధ్ర లో ఉన్న పట్టణాల వరకు పాకింది.పబ్లిక్ గా కాకపోయినా.అమ్మానాన్నలు ఇంట్లో లేనప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవటం.ఈ పార్టీలు అంతకముందు అబ్బాయిల వరకే పరిమితం.ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండి రాత్రి ఇంటికి రాకపోయినా పట్టించుకునే పరిస్థితిలు లేవు.అమ్మ నాన్నలకి అబద్దం చెప్పి నమ్మించటం కష్టం కాదు కదా !.

    ఇలాంటి వాళ్ళని మనం ఏమి చెయ్యలేం.ఎవడి కర్మ వాడిది.చెప్పినా వినరు.వారి వరకు వచ్చి అర్ధం చేసుకొని వాళ్ళలో మార్పు రావాల్సిందే.

    ReplyDelete
    Replies
    1. ముందుగా కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శేఖర్ గారు!
      ఇంట్లో...లేకపోతె బార్లో..రెస్టారెంట్లల్లో పార్టీలు చేసుకుంటే కొంతలో కొంత నయం. అవి లైసెన్స్ పొంది వుంటాయి. కానీ ఈ మధ్యన మరీ పబ్లిగ్గా వైన్ షాపుల ముందే గుమి గూడి తాగుతున్నారు. మునుపు కూలిపనులు చేసుకొనే వారే అలా తాగేవారు. ఎందుకంటే బార్లల్లో, రెస్టారెంట్లల్లో తాగడం వాళ్ళ స్థోమతకు సరిపోదు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, యువకులు రోడ్లపై తాగడం...ట్రాఫిక్కుకి అంతరాయం కలిగించడం...వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగించడం సర్వసాధారణం అయిపొయింది. పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ చూసి చూడనట్టు వుంటున్నారు. ఇక తాగి డ్రైవ్ చేయడం దారుణం. హైదరాబాదు ఈ విషయంలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. దీనికి ముఖ్య కారణం పిల్లలకు వారి పేరెంట్స్ విపరీతమైన స్వేచ్చనివ్వడం...అలా ఇవ్వడం మోడ్రెనైజేషనులో భాగంగా ఫీలవ్వడం. ఇవన్ని చూస్తుంటే నాకు దీనిని ఎలా అరికడతారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఆశాజీవులుగా మార్పు వస్తుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేమేమో అని అనిపిస్తుంది

      Delete
  17. Nice Article sir.
    my opinion

    Everybody is looking for change in their life. change may come or may not come .

    whenever people read this article they will think about their behaviors.






    ReplyDelete
  18. బాగుంది సురేశ్ గారు.... శ్రీశ్రీ, ’సిరివెన్నెల’గారి పాటలను చక్కగా సందర్భోచితంగా వాడారు.

    ReplyDelete
    Replies
    1. మీకు కథ నచ్చినందుకు సంతోషంగా వుంది నాగార్జున గారు. అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!

      Delete
  19. సురేష్ గారు.. మన ముందు ఉన్న సామాజిక సమస్యని.. మీడియా..భాద్యతని సునిశిత పరిశీలనతో.. మంచి మార్పు కోరుకుంటూ..ఆశావాదంతో..మీరు వ్రాసిన ఈ కథ చాలా బాగుంది.
    మీరన్నట్టు ఈ కథ ని పత్రికలకి పంపి ఉంటే బాగుండేది.
    ఇలాటి కథలు ఎవరికీ కావాలి అంటూ రిజెక్ట్ అయి ఉండేది.
    మహా కవి శ్రీ శ్రీ, సిరివెన్నెల పాటలని ఉదాహరించారు.
    వారు.. చైతన్యవంతంగా వ్రాయబట్టే కదా!మనం ఇప్పుడు చైతన్యవంతంగా ఆలోచించేటప్పుడు వారి గీతాలని తలచు కున్తున్నాం.
    సమాజానికి హితమైన రచనలు, సమాజానికి హితమైన పనులు పనికి రాని దురదృష్ట కరమైన వ్యవస్థలో మనం ఉన్నాం. మార్పు కోసం ఆశావాదంతో.. పయనించడం, మనకి చేతనైన విధంగా చేతనగా మెలగడమే..చేయగల్గింది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు వనజా గారు! పత్రికకు పంపాను...ప్రచురణకు ఎన్నికైంది. కానీ దాదాపు సంవత్సర కాలంగా పబ్లిష్ చేయకుండా పట్టి వుంచారు. ఇక నాకే విసుగొచ్చి బ్లాగులో పెట్టాను. ఇక శ్రీశ్రీ గారి రచనలు ఎప్పటికీ స్పూర్తిని కలిగించేవే. సిరివెన్నల గారి పాటలు సినీవినీలాకాశంలో మెరిసే దీపికలు.
      'మార్పు కోసం ఆశావాదంతో.. పయనించడం, మనకి చేతనైన విధంగా చేతనగా మెలగడమే'.. సరిగ్గా చెప్పారు. కథ చదివి అభిప్రాయం తెలియజేనందుకు మరొక్కసారి ధన్యవాదాలు వనజా గారు!

      Delete
  20. చాలా బాగా రాశారు సురేష్ గారు...కమనీయం గారి అభిప్రాయమే నాది కూడా..తాగుడు అనేది వ్యక్తిగత బలహీనత..ఎవరికీ వారే తమ బలహీనతల నుంచి బయటకి రావాలి గానీ ప్రభుత్వమో,సమాజమో దాన్ని మార్చ గలగడం కష్టతరం...ఆ మార్పు ప్రజల్లోనే రావాలి...ఇప్పటి రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ ఆదాయాన్ని వదలకుండా కాపాడటం లో చూపించే శ్రద్ధ ,ప్రజల ఆరోగ్యం విషయం లో చూపడం లేదు..తత్ఫలితమే ఈ వైను షాపులు,సిగరెట్ లు, కోకా కోల వగైరా లు...తాగుడు ఒక్కటే కాదు సమాజం లో ఎప్పుడు రెండు మార్గాలుంటాయి..మంచి మార్గం చెడు మార్గం అని....చెడు మార్గాన్ని తమకు తాముగా కోరుకుని ఆరోగ్యం పాడు చేసుకుని,అటు కుటుంబాన్నికూడా బాధ పెట్టేవారిని ఆ దేవుడే రక్షించాలి...

    ReplyDelete
  21. సురేష్ గారు, కథ నాకు బాగా నచ్చిందండి.తాగుడు కావ్వనివ్వండి, ఇంకేదన్నా సమస్య అవ్వనివ్వండి, ప్రభుత్వం law ని strict గా అమలుపరిస్తే ఎలాంటి ప్రాబ్లంస్ ఉండవు.

    ఉదాహరణకు-1. తాగి డ్రైవ్ చేస్తే license రద్దు చెయ్యడం. 2. తాగి భార్యల మీద చెయ్యి చేసుకుంటే కట్టినం గా శిక్ష పడటం-దాని పర్యవసానం గా జైల్ కి వెళ్ళి వచ్చిన వారికి సరి అయిన ఉద్యోగాలు రాకపోవడం.. సమాజం వారిని చిన్న చూపు చూడటం. తాగడం/తాగకపోవడం వ్యక్తిగతమే కావచ్చు , కాని దాని ప్రభావం ఇతరుల మీద, సమాజం మీద పడకూడదు.. అన్న law ని కట్టినం గా అమలు పరిస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు కథకు ఇచ్చిన ముగింపు కూడా చాలా బాగుంది.

    ReplyDelete
  22. కొంచం చాలా ఆలశ్యంగా స్పందిస్తున్నా.ముందుగా విషయం సూటిగా సుత్తిలేకుండా బాగా రాసారు,సమస్య ప్రస్పుటంగా అర్ధం అవుతోంది,పరిష్కారం మనం ఊహించుకున్నంత సులువుగా లేదు కానీ ఆశించడంలో తప్పులేదేమో.

    మీరు ఉదహరించిన సిరివెన్నెలే రాసిన మరికొన్ని వాక్యాలు "ఏ కృష్ణ గీత ఆపింది మహాకురుక్షేత్రం,ఏ సీత గీత ఆపింది రావణకాష్టం"(కరక్టేనా?) అన్నట్టు ఇదొక శాఖాచంక్రమణం అండీ.ఇక్కడ తప్పు ఎవరిదీ అంటే ఎవరి లాజిక్ వాడికి ఉంటుంది,ఆఖరికి హత్య చేసినవాడికి (కసబ్ గాడితో సహా)కూడా వాడి లాజిక్ వాడికుంటుంది తను చేసిందీ,చేసేదీ తప్పని తెలిసినా సరే.

    "తాగుబోతులకి,మత్తుమందు బానిసలకీ ఒక రకమయిన తెలివితేటలు,నక్కజిత్తులు అలవాటవుతాయి. మత్తు మందు ప్రబావం పెరిగేకొద్దీ ఆ వ్యక్తిలో నక్కజిత్తులు పెరిగిపోతుంటాయి"


    ఇక్కడే మరి కొన్ని మంచి మాటలు (గొల్లపూడి గారు రాసినవి గుర్తొస్తున్నాయి)


    నీతి: పరపతి ఉన్న వ్యక్తుల వెనక అవినీతిని పోషించేవారు కోకొల్లలుగా వుంటారు. సమకూర్చి పంచుకునేవారూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే- నీ అవసరం ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు- నీ బలహీనతల్ని ఆనందంగా పోషిస్తాడు. కారణం- "బలహీనత’ నువ్వు గర్వపడేదికాదు. అతను చేసే పనీ గర్వపడేదికాదు. కాగా- నీ తల వొంచేది. ఉదాహరణకి- రోజూ పూజకి పువ్వులు తెచ్చియివ్వడం భక్తి అనిపించుకుంటుంది. రోజూ చీకటిపడే సమయానికి విస్కీ తెచ్చియివ్వడం- నిన్ను లోబరుచుకునే గాలం అనిపించుకుంటుంది.

    ReplyDelete
  23. మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు లాస్య గారు!

    ReplyDelete
  24. చాల బాగుంది సురేష్ గారు ! ఇవాలే చూసాను ఈ పోస్ట్ ని ! సూపర్బ్ !

    ReplyDelete
  25. లేదు మారాలి. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి?
    నిజమే మారాలి. నాకు తెలిసినంతలో ఎవరి వారు మారాలి.తరువాతనే ప్రభుత్వమైనా ఇంకోటైనా అనుకుంటాను.
    Great intensity in your words. :)

    ReplyDelete
  26. మీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
    http://ac-blogworld.blogspot.in/p/blog-page.html

    ReplyDelete
  27. Chaalaa chaalaa baagundi :-):-)

    ReplyDelete